హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): పెద్దల కబ్జాలకు జీహుజూర్ అంటూ పేదలపై బుల్డోజర్ను ప్రయోగిస్తున్న హైడ్రాపై ‘నమస్తే తెలంగాణ’ అలుపెరుగని పోరాటం చేసింది. బ్లాక్‌మెయిల్‌కు అడ్డాగా మారిన హైడ్రా ఆగడాలను ఆదిలోనే పసిగట్టి.. తొలిరోజు నుంచే బాధితుల పక్షాన నిలిచింది. పేదల పక్షాన నిలువాల్సిన ప్రముఖ పత్రికలు, టీవీ చానళ్లు ఏవీ కూడా హైడ్రా విధ్వంసంపై వేలెత్తి చూపే సాహసం చేయలేక వెనుకడుగు వేస్తున్న సందర్భంలో ‘నమస్తే తెలంగాణ’ బాధితుల పక్షాన నడుం కట్టింది. నిరుపేదల కన్నీటి గాథలను సచిత్రంగా ప్రచురించి వారి ఆవేదనకు అద్దం పట్టింది. పాలకుల పైశాచికత్వాన్ని ఎండగట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సోషల్‌మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలే ‘నమస్తే తెలంగాణ’కు వెలకట్టలేని ప్రశంసలు.
హైడ్రా అరాచకాన్ని బట్టలిప్పి నడిబజారులో నిలబెడుతున్న నమస్తే తెలంగాణపై కక్షగట్టిన రంగనాథ్ అనేక ఇబ్బందులు పెట్టాలని చూసినా అదరలేదు… బెదరలేదు. హైడ్రా దౌర్జన్యానికి అక్షర రూపం ఇస్తున్న నమస్తే తెలంగాణ జర్నలిస్టులపైనా ఆయన పగబట్టారు. వృత్తిధర్మం పాటిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆ జర్నలిస్టుకు ఇల్లు ఉందా? ఏమైనా ఉల్లంఘనలు ఉన్నాయా? అని విచారణ జరిపి తనలోని వంకర బుద్ధిని బయటపెట్టుకున్నారు. సంపాదక సిబ్బందిని ప్రైవేట్ సంభాషణల్లో రాయలేని బూతులు తిట్టిన సందర్భాలూ ఉన్నాయి.
మరోవైపు బాధితుల పక్షాన వార్తలు రాస్తే, వారినే బెదిరించి నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులు ఇప్పించి ఇగోను సంతృప్తి పరుచుకున్నారు. ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా ధర్మపోరాటంలో నమస్తే తెలంగాణ వెనక్కి తగ్గలేదు. పాపం పండింది… బాధితుల ఉసురు తగిలింది. అధికారం చేతిలో ఉన్నదని అందరినీ వణికించిన రంగనాథ్‌కు ఇప్పుడు వలవల ఏడుపు ఒక్కటే మిగిలింది. పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టు.. పేదలను పీడించిన తొమ్మిది తలల హైడ్రా విషసర్పంపై హైకోర్టు గొడ్డలి వేటు వేసింది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని రుజువైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా పూర్తిగా లోపభూయిష్టమంటూ నమస్తే తెలంగాణ మొదటినుంచీ చెప్తూనే ఉంది. పాలకపక్షానికి అనుకూలంగా సామాన్యులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ, తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ అంతా తామే అయి అన్ని శాఖలను నిర్వీర్యం చేస్తూ హైడ్రా చేసిన విధ్వంసంపై నమస్తే తెలంగాణ పోరాటం చేసింది. రంగనాథ్ ఒంటెద్దు పోకడలపై హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు నమస్తే కథనాల్లో వాస్తవికతను ప్రతిబింబించాయి. హైడ్రా చర్యలపై విసుగెత్తిన సామాన్యులు కోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తుంటే, వారికి బాసటగా ‘నమస్తే తెలంగాణ’ తన కలాన్ని జోడించింది.
బహిరంగ వేదికలపై సీఎం రేవంత్‌రెడ్డితో సహా రంగనాథ్ చాలాసార్లు తాము పేదలపక్షాన ఉన్నామని చెబుతూనే చాలాచోట్ల నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లు కూలగొట్టారు. సున్నంచెరువు విషయంలో చదువుకుంటున్న పిల్లల పుస్తకాలు సైతం ఆ కూల్చివేతల్లో ఉండటంతో పిల్లలు పడ్డ బాధకు ప్రతి ఒక్కరూ చలించినా హైడ్రాలో ఎలాంటి చలనం లేదు. ఆ తర్వాత రెండు మూడు వేదికలపై తాము హైడ్రా ఏర్పాటైన కొత్తలో చాలా తొందరపడ్డామంటూ ఆ తర్వాత క్రమక్రమంగా సర్దుకుంటూ పోతున్నామని చెప్పినా మొదట జరిగిన కూల్చివేతల బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. నమస్తే తెలంగాణ మొదటి నుంచీ కూల్చివేతల్లో ప్రజలు నష్టపోతున్న పరిస్థితిని వాస్తవ కోణంలో ప్రచురించింది. పెద్దల పక్షాన హైడ్రా నిలిస్తే.. పేదల పక్షాన నమస్తే తెలంగాణ అక్షర పోరాటం చేసింది.. హైకోర్టు తీర్పుతో ఇప్పుడీ పోరాటం ఫలించింది. పేదలకు ఊరట లభించింది.
ఓఆర్ఆర్ పరిధిలో 2024 జూలై 19న హైడ్రా ఏర్పాటు తర్వాత జరిగిన విధ్వంసంపై నమస్తే తెలంగాణ వరుస కథనాలు ప్రచురించింది. హైడ్రా పేదల పట్ల వ్యవహరించిన తీరు, ఇండ్లు కూల్చే క్రమంలో బాధితులను కట్టుబట్టలతో బయటకు పంపిన విధానం ఎంత హృదయవిదారకమో ఎలుగెత్తి చాటింది. కనికరం లేని హైడ్రా సిబ్బంది కర్కశత్వంపై కథనాలే అస్త్రంగా ఉపయోగించింది. ఈ రెండేండ్లలో హైడ్రా విధ్వంసాన్ని లోకానికి చూపించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో హైడ్రా నిర్లక్ష్యపు ధోరణిపై కూడా కథనాలు ఇచ్చింది. లోతుకుంట, ఈదులకుంటల్లో సర్వే నంబర్ల మాయాజాలం చేస్తూ హైడ్రా వ్యవహరించిన తీ రును నమస్తే తెలంగాణ సాక్ష్యంగా బట్టబయలు చేసింది. ముఖ్యంగా లోతుకుంటపై పలు జ డ్జిమెంట్లు వారికి అనుకూలంగా ఉన్నా..ఎక్కడా హైడ్రాకు సంబంధం లేకున్నా ప్రైవేట్ సై న్యంలా ఆ భూమిలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన తీరును ఫొటోలు సహా ప్రచురించింది.
హైడ్రాపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. అహంకారంతో హిట్లర్ వారసుడినని ప్రకటించుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆయనకు పట్టిన గతే పట్టబోతున్నది. హైడ్రా పేరిట ప్రజలు పడ్డ బాధలకు రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. 63సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగనాథ్ విషయంలో హైకోర్టు ఈ తీర్పునివ్వడం సబబే.
– ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయవ్యవస్థ పై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. హిట్లర్ పాలన ప్రేరణగా హైడ్రా తీసుకొచ్చినట్టు గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. నగరంలోని లోతుకుంట, బహదూర్‌గూడ, అమీన్‌పూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో హైడ్రా చర్యలతో నిరాశ్రయులైన వారికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వమే న్యాయం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైడ్రా సాకుగా ‘రియల్’ దందాకు తెరలేపారు. హైడ్రా చర్యలపై స్వతంత్ర న్యాయ విచారణ చేయించాలి. చట్టవిరుద్ధ కూల్చివేతలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– మేడే రాజీవ్‌సాగర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
హైకోర్టు తీర్పు ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం. హైడ్రా పేరుతో అమాయక ప్రజలను వేధించారు. ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధం. ఏకంగా 63 కోర్టు ధికరణ కేసులు ఉండటమే ఆయన నిరంకుశ ధోరణికి అద్దం పడుతున్నది. ఇప్పటికైనా బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, చట్టవిరుద్ధమైన కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
-గోసుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్