Manjira River | పాపన్నపేట, అక్టోబర్ 4 : ఏడుపాయల వద్ద మంజీరా నదిలో ఇరువురు కొట్టుకుపోతుండగా పాపన్నపేట పోలీసులు రక్షించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన పలువురు యువకులు దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం శనివారం ఏడుపాయలకు చేరుకొని మంజీరా నదిలో నిమజ్జనం చేస్తున్నారు. ఇదే సమయంలో నీటి ఉధృతికి వారిలో నుండి కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వినయ్, సాయి అనే ఇరువురు యువకులు కొట్టుకుపోయారు. కొద్ది దూరం వెళ్లాక చెట్టు కొమ్మలకు తట్టుకొని, రక్షించాలంటూ వారు ఆర్తనాదాలు చేశారు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడే విధి నిర్వహణలో ఉన్న పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని, ఫైర్, రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. మెదక్ రూరల్ సీఐ జార్జి , మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్‌తోపాటు రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చారు.
ఎవరు వెళ్లొద్దని ఎన్నిమార్లు సూచించినా..
ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. వరద ఉధృతి ఉన్నందున నది వైపు ఎవరు వెళ్లొద్దని ఎన్ని మార్లు సూచించినా కొంతమంది పెడచెవిన పెట్టి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుండి అయినా నీటి ఉధృతి ఉన్న వైపు ఎవరు వెళ్లొద్దని, వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఏడుపాయలకు వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లాలి తప్ప నీళ్లలోకి దిగి సెల్ఫీలు దిగొద్దని, స్నానాలు చేయడానికి వెళ్లొద్దని, అలా వెళ్లి విలువైన తమ ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. ఎవరైనా నీటిలోకి వెళ్లి సాహసాలు చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఎస్ఐ హెచ్చరించారు. ఇక ఇరువురు నదిలో కొట్టుకుపోయారన్న సమాచారం తెలుసుకున్న పాపన్నపేట ఎస్ఐ వెంటనే స్పందించడం పట్ల డీఎస్పీ ప్రసన్నకుమార్,ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్‌ను అభినందించారు.
HYDRAA | రేవంత్ రెడ్డి పక్కా దొంగనే.. నిప్పులు చెరిగిన హైడ్రా బాధితురాలు
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్