BRS Party | మెదక్ : తెలంగాణ ఉద్యమకారులంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. పలు కారణాలతో ఉద్యమ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా, ఆయా పార్టీల్లో ఇమడలేక యూటర్న్ తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యమ పార్టీగా ఏర్పాటైన రోజుల్లో క్రియాశీలకంగా పని చేసిన చాలా మంది నేతలు ఆ తర్వాత పార్టీని వీడారు. ప్రస్తుతం ఆ నేతలంతా మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 కార్లతో కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరనున్నారు.
మళ్లీ మెదక్ నియోజకవర్గానికి పూర్వ వైభవం..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది. గత పది సంవత్సరాల లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నారాజై వెళ్లిన నాయకులు మళ్లీ సొంతగూటికి బీఆర్ఎస్ పార్టీకి రావడం ఎంతో సంతోషకర విషయం అని అన్నారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. 19 నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి దూరం ఉండి అనేక ఇబ్బందికర సమస్యలు ఎదుర్కొన్నారు. సొంతగూటికి వస్తున్న సందర్భంగా స్వాగతం పలికారు.
అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మళ్లీ మెదక్ నియోజకవర్గానికి పూర్వ వైభవం వస్తుంది. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. గత 19 నెలల్లో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అభివృద్ధి చేయక మెదక్ కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వస్తున్న జీవన్‌రావు గంగా నరేందర్, ఇతర నాయకుల ముఖంలో సంతోషం కనిపిస్తుందని వాళ్లు రావడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు.
కనీస మర్యాద, గౌరవం కూడా లేదు..
ఈ సందర్భంగా జీవన్ రావు, గంగా నరేందర్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో క్షణికావేశంలో జరిగిన తప్పు వలన మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మార్పు పేరు మీద మెదక్‌లో దోపిడీ ప్రారంభమైంది. 19 నెలలుగా మేము అనేక రకాలుగా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాం. ఆత్మగౌరవం, మర్యాద లేని పరిస్థితుల్లో ఉన్నాము. గెలిచిన రెండు నెలల నుండి పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్క వ్యక్తికి ఆదరణ లేదు. కనీస మర్యాద, గౌరవం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పుడే పుట్టిన పాప తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో అదేవిధంగా కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అంతే క్షేమంగా ఉంటుందనే భావనతో మేము చేసిన పొరపాటు వలన మెదక్ ప్రజలకు క్షమాపణ కోరుతున్నాం.
ఈ రోజు సొంతగూటికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మెదక్ మళ్లీ పూర్వ వైభవం దిశగా పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకెళ్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోని భాషలలో మమ్మల్ని తిట్టారు. మేము చేసిన తప్పును తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు.హరీష్ రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి. జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కో కన్వీనర్ లు గడ్డమీది కృష్ణ గౌడ్, లింగారెడ్డి, జుబర్ అహ్మద్, సాయిలు,మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు. ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, చంద్రకళ, మాయ. మల్లేశం,మెదక్,శంకరంపేట్ ఆర్, పాపన్నపేట్, నిజాంపేట్, మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, పట్లోరి.రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీలు,మెదక్ పట్టణ, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు