నాగల్గిద్ద, జూలై7: పేదలకు ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Indlu) అవగాహన కల్పించడానికి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించ తల పెట్టిన నమూనా ఇంటి నిర్మాణంలో తీవ్ర జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇండ్లు లేని నిరు పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. రెండు నెలల క్రితం గ్రామలలో రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను స్థానిక ఎమ్మెల్యే, జిల్లా, మండల అధికారులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా అవగాహన కోసం మండల కేంద్రంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. 45 రోజుల్లో దీన్ని నిర్మించాల్సి ఉంది. అయితే ఇంత వరకు పూర్తి కాకపోవడం, పునాది స్థాయిలోనే నిలిచి పోవడంతో అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ఎలా అవగాహన కల్పిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొదటి విడతలో మండల వ్యాప్తంగా 300లకు పైగా ఇండ్లను మంజూరు చేశారు. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నా కోంత మంది మాత్రమే ముగ్గు పోసి నిర్మాణ పనులు నేమ్మదిగా ప్రారంభిస్తున్నారు.
త్వరలో నిర్మాణ పనులు..
ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణం తీవ్ర జాప్యంపై హౌసింగ్ ఏఈ సత్యనారాయణ వివరణ కోరగా ఇళ్లు త్వరలో నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. మేస్త్రి కూలీల కోరత వల్ల కొంత ఆలస్య అయిన వాస్తవమేనని చెప్పారు.