Padma devender reddy | చేగుంట, మే 28 : మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శేరిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు శంకరంపేట్ ఆర్ మండలం కామారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, కొనుగోలు ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా లారీలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే నిల్వ ఉండిపోతుందని చెప్పారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిసి మొలకెత్తుతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యానికి మొలకలు వస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిపల్లి కొనుగోలు కేంద్రంలో 250 సీరియల్ నంబర్లు ఉండగా.. ప్రస్తుతం 140 సీరియల్ మాత్రమే నడుస్తోందని, కామారం కేంద్రంలో 140 సీరియల్ నంబర్లు ఉండగా కేవలం 80 మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంకా దాదాపు 10 లారీల ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తోందన్నారు.
కామారం గ్రామానికి చెందిన రైతు కృష్ణ లక్ష్మి ధాన్యం 30 రోజులుగా నిల్వ ఉండటంతో మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. తడిసిన, మొలక వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం బైలార్ రైస్ మిల్లులకు తరలించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరో నాలుగు రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అధికారులకు సమయపాలన లేకపోవడం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని కన్నీరు పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అకాల వర్షాలు పడుతున్నప్పటికీ ధాన్యం తరలింపుపై అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం దారుణమన్నారు. రైతులు ఎండలో, వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యాన్ని రక్షించేందుకు తగిన టార్పాలిన్లు, తాగునీటి సౌకర్యం వంటి ప్రాథమిక వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు.
రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మెదక్ నియోజకవర్గంలోని మొత్తం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేస్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నాలుగు రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వీరి వెంట శంకరంపేట, నార్సింగ్ మండల అధ్యక్షులు పట్లోరి రాజు, కుమ్మరి బాబు, నార్సింగ్ మండల మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు కోల్కురి లక్ష్మారెడ్డి,
సర్పంచ్లు గొండస్వామి,ఇమ్మడి నరేష్, మాజీ సర్పంచ్లు పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దయానంద్ యాదవ్, మండల నాయకులు పడాల శ్రీనివాస్, ఏమా వెంకటేశం, వడ్డెర సిద్దిరాములు, మహేష్ గౌడ్, అంజయ్య, నర్సింగరావు, యూత్ నాయకులు సురేష్, సురేష్ తదితరులు ఉన్నారు.

