Vimal | తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, విమల్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు శిక్ష అమలుపై తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది. విమల్ నిర్మించిన ‘మన్నర్ వాగైయరా’ చిత్రం నిర్మాణం కోసం ఫైనాన్షియర్ గోపి వద్ద నుంచి సుమారు రూ.4.5 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో విమల్ ఇచ్చిన చెక్ బ్యాంకులో తగినంత నిధులు లేకపోవడంతో బౌన్స్ అయింది.
ఆ తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ గోపి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం కోర్టు విచారణకు వెళ్లింది.ఈ కేసులో పలుమార్లు విమల్ కోర్టుకు హాజరయ్యారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఆర్తి తీర్పు వెలువరిస్తూ, విమల్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
తీర్పు వెలువడిన వెంటనే విమల్ తరపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం కల్పించాలని, శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టును కోరారు. వారి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం జైలు శిక్ష అమలుపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో విమల్‌కు అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం లభించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.