హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆనన్య ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ రోగి బలయ్యాడు. గ్లాల్బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవడానికి నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి.. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఉమ్మల మల్లయ్యకు ఈ నెల 26వ తేదీన గాల్‌బ్లాడర్ ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం అతను తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. దీనిపై ఆస్పత్రి వైద్యులకు తెలిపినా.. పట్టించుకోలేదు. ఆపరేషన్ తర్వాత ఇలాగే ఉంటుంది.. చేసేదేమీ లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. రెండోరోజు మరింత తీవ్ర నొప్పితో మల్లయ్య బాధపడ్డాడు. అప్పుడు కూడా డాక్టర్లు పట్టించుకోలేదు.. పదే పదే నొప్పి అని వస్తున్నారంటూ విసుక్కున్నారని కుటుంబసభ్యులు వాపోయారు. ఈ క్రమంలో అదే నొప్పితో ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో మల్లయ్య ప్రాణాలు విడిచాడు.
దీనిపై ఆస్పత్రి వైద్యులను ప్రశ్నిస్తే మల్లయ్య గుండెపోటుతో మరణించాడని.. తమకేమీ సంబంధం లేదంటూ ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులిపేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లోనూ బాధితులు ఫిర్యాదు చేశారు.