బచ్చన్నపేట : వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలను ( Godavari Water ) వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ( BRS Protest ) ఆధ్వర్యంలో ఆదివారం రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు పెట్టిన రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయడం కష్టంగా మారిందని, గోదావరి జలాలు అందితే మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీటి భరోసా కలుగుతుందని తెలిపారు. నీటి కోసం ఎదురుచూస్తూ రోజులు గడుస్తున్నా అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నీరు వస్తేనే పంటలకు భరోసా బచ్చన్నపేట మండల రైతాంగానికి గోదావరి జలాలు అత్యంత కీలకమని నాయకులు పేర్కొన్నారు.
నీటి మళ్లింపు, సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చూడాలని డిమాండ్ చేశారు. మండలానికి గోదావరి జలాలు రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తులకు కొందరు ఇరిగేషన్ అధికారులు వంతపాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు సర్పంచుల ఫోరం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గంగం సతీష్‌రెడ్డి , ఫోరం మండల అధ్యక్షుడు ఫిరోజ్ ఆరోపించారు. గోదావరి జలాల కోసం చేపట్టిన ధర్నాకు రైతులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బచ్చన్నపేట ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ధర్నాలో సర్పంచులు మదికుంట రాధ, జిల్లాల భాస్కర్‌రెడ్డి, మహమ్మద్ ఆజాం, ఆరే రవికుమార్, పోతుల వెంకటేష్, కోడూరి స్వర్ణలత, శివకుమార్, పెరబోయిన కళ్యాణి, పరుశురాములు, నూకల కల్పన, రాజిరెడ్డి, నేల కవిత, మురళి, బచ్చన్నపేట ఉపసర్పంచ్ బైరి రజిత-వెంకటేష్ మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దూడల కనకయ్య, మాజీ కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్, బీఆర్ఎస్ నాయకులు , రైతులు పాల్గొన్నారు.