Mukesh Khanna : ‘శక్తిమాన్’ సీరియల్‌తో 90వ దశకంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు (Noted Actor) ముఖేష్ ఖన్నా (Mukesh Khanna) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జాతీయగీతం (National Anthem) ‘జన గణ మన (Jana Gana Mana)’ ను తొలగించి దాని స్థానంలో ‘వందేమాతరం (Vandematharam)’ ను అధికారిక జాతీయగీతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘జన గణ మన’ మన దేశ జాతీయ గీతం కాదని, అది బ్రిటీష్ రాణిని కీర్తిస్తూ రాసిన గీతమని ఆయన ఆరోపించారు.
ఆదివారం ఒక వార్తా సంస్థతో ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ.. ‘వందేమాతరంను జాతీయ గీతంగా చేయాలని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ రాణి ఎలిజబెత్‌ను పొగుడుతూ.. ‘జన గణ మన’ రాశారు. దానిని మనం జాతీయగీతంగా స్వీకరించాం. అందులో ప్రస్తావించిన భాగ్యవిధాత, పంజాబ్, సింధ్ వంటివి మనవి కావు. కానీ ‘వందేమాతరం’ పూర్తిగా మనది. లతా మంగేష్కర్ ఆ గీతాన్ని ఎంతో అద్భుతంగా ఆలపించారు’ అని పేర్కొన్నారు.
తాను కూడా ‘వందేమాతరం’ పై ఏడు నిమిషాల నిడివిగల ఒక ఐకానిక్ గీతాన్ని రికార్డ్ చేశానని, అది ఆరు నెలల్లో విడుదల అవుతుందని తెలిపారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా ‘జన గణ మన’ ను తొలగించి, ‘వందేమాతరం’ ను తీసుకురావాలి. ప్రధాని మోదీ ఈ దిశగా ఇప్పటికే పని ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యక్రమంలో ‘వందేమాతరం’ ను తప్పనిసరి చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం’ అని ముఖేష్ ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ముఖేష్ ఖన్నా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా తన ‘శక్తిమాన్’ పాత్రపై వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు ముఖేష్ ఖన్నా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. సమయ్ రైనాను ‘కుక్క తోక’ అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ తర్వాత కొద్ది రోజులకే వారిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించడం గమనార్హం. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా, ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించడంలో ముఖేష్ ఖన్నా ఎప్పుడూ ముందుంటారని సినీ వర్గాలు అంటుంటాయి.