MLA Sunitha lakshma reddy | నర్సాపూర్, సెప్టెంబర్ 1 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. సోమవారం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎండిపోయినటువంటి బీడు భూములకు సాగునీరందించిన గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని వెల్లడించారు. పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని డిస్కవరీ ఛానల్లోనే గొప్పగా కాళేశ్వరం గురించి చెప్పడం జరగిందని గుర్తుచేశారు.
సుప్రీంకోర్ట్ సైతం కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించడం జరిగిందని వెల్లడించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూ, రాజకీయంగా వాడుకుంటూ ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఓట్లు దండుకోవాలనే దుర్భుద్ధితో అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేయడం జరిగిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఇచ్చిన రిపోర్ట్..
గోష్ కమిటీ రిపోర్ట్ కాళేశ్వరానికి వ్యతిరేఖంగా వస్తుందని మేము అనుకోలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఇచ్చిన రిపోర్ట్ అని బావిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో జరిగిన చర్చల్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా సంభాషణలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి హరీష్ రావు దీటుగా సమాధానం చెప్పడం జరిగిందని వెల్లడించారు. కావాలనే కుట్రపూరితంగా, కక్షసాధింపుగా కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీని వాడుకోవడం జరుగుతుందని మండిపడ్డారు. హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయనే భయంతో సీఎం, మంత్రులు మాటిమాటికి అడ్డుకోవడం జరిగిందన్నారు. ఎంత అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన కాళేశ్వరం అనేది ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
20 లక్షల ఎకరాలకు సాగునీరుని అందించిన గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని సీఎం, మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆ నీరు కాంగ్రెస్ నుండే వస్తున్నాయి కదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను బద్నాం చేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ పడిపోయేటట్టు చేసి ఆ నీళ్ళన్ని బనకచర్లకు అందించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని తెలిపారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగిపోడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీన్ చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. పిల్లర్లు కుంగిపోతే శబ్దం రాదు అని… కుంగిపోయిన సమయంలో రెండు కిలో మీటర్ల వరకు పేల్చిన శబ్దం రావడం జరిగిందని వారు చెప్పడం జరిగిందని అన్నారు.
కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నా పట్టించుకోవడం లేదు..
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్లను బాగు చేయిస్తామని కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గంధమల్లలో రిజర్వాయర్‌కు సీఎం భూమిపూజ చేయడం జరిగిందని… గంధమల్లకు మల్లన్న సాగర్ నుండే నీరు వస్తాయి కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్ఎల్బీసీ కూలిపోతే అక్కడకు ఎన్డీఎస్సీ ఎందుకు వెళ్లలేదని విమర్శించారు. కాళేశ్వరంపై విచారణకు సీబీఐకి ఏకపక్షంగా అప్పగించడం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఎలాంటి తప్పులు లేకున్నా తప్పుడు రిపోర్ట్ తయారు చేసి సీబీఐకి అప్పగించడం విడ్డూరమన్నారు.
ప్రతి సంవత్సం ఒక లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక చెక్ డ్యామ్‌ను కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకపోగా కట్టిన ప్రాజెక్టులను కూల్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఎరువుల కోసం రైతులు రోడ్లపై ధర్నా చేస్తుంటే అది బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. యూరియా గురించి, వరదల గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ తీసుకురావడం చాలా సంతోషమని, 42 శాతం రిజర్వేషన్ లీగల్గాల్గా అథెంటిక్ ఉంటేనే న్యాయం జరుగుతుందని అన్నారు.
వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారు..
ప్రజా, రైతు, విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఇలాంటి కార్యక్రమాలకు పాలపడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడడం జరిగిందని గుర్తుచేశారు. సీబీఐ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తున్నారా లేదా రాహుల్ గాంధీకి వ్యతిరేఖంగా పనిచేస్తున్నారా.. ? అని ప్రశ్నించారు.
గతంలో ఈడీ, సీబీఐ బీజేపీ పార్టీ జేబు సంస్థలుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి నేడు మాట మార్చి కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణను సీబీఐకి అప్పగించడం అనేదాంట్లో అర్థమేంటని ప్రశ్నించారు. దీనిబట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కైనట్లు కనపడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఎంత మంది జత కట్టినా కేసీఆర్ స్థాయిని ఎవరు కూడా తగ్గించలేరని ఘాటుగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు షేక్ హుస్సేన్, విఠల్‌గుప్తా, నర్సింహులు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BRS | కేసీఆర్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Lakshmi Devipalli | బావోజి తండాలో తాగు నీటి సమస్యను పరిష్కరించండి
Karepalli | ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి క్రాస్ రోడ్ యువత.. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న యువకులు