కారేపల్లి,సెప్టెంబర్ 1: ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్) సేవా కార్యక్రమాలలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన యువకులు ఆపద వచ్చిన కుటుంబాలకు తామున్నామంటూ భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ గ్రామ యువకులతోపాటు గ్రామస్తులు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ మరణించిన కుటుంబీకుల బంధువులకు టీ,టిఫిన్, భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.
కుల, మతాలకతీతంగా గ్రామ యువకులు, స్థానికులు అందిస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. ఇటీవల కాలంలో కొద్దిరోజుల వ్యవధిలోనే కారేపల్లి క్రాస్ రోడ్ గ్రామంలో వేరువేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా ఆ గ్రామ యువత మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ తమ వంతు సేవలను అందించారు.