చండూరు,మార్చి 2: చండూరు తాసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. మండల ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండాల్సిన చండూరు ఎమ్మార్వో ఆఫీసు (తాసీల్దార్ కార్యాలయం) అవినీతికి అడ్డాగా మారింది. రైతులు భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.
ప్రతి పనికీ ఒక రేటు?
రైతులు తమ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చేసుకోవడానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. అయితే ఇక్కడ రైతులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేసే భూమిని బట్టి రూ.1000 నుంచి రూ.2000 ఫైలుకు ఇంత అని కింది స్థాయి సిబ్బంది వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే ఫైలు వెనక్కి పోవాల్సిందే.
వేధింపులు తప్పడం లేదు..
రైతులు, ఇతర పత్రాల కోసం వచ్చే వారు అడిగి నంత ముట్టచెబితేనే ఫైలు ముందుకు కదులుతుందని, లేదంటే సాకులు చూపు తూ, కొర్రీలు పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల నిలయంగా కార్యాలయం
కార్యాలయంలో మహిళా రైతులు, చిన్న పిల్లల తల్లులు వస్తే చంటి బిడ్డలకు పాలు ఇవ్వాలన్నా బహిరంగ ప్రదేశంలో చెట్ల కింద కూర్చోని ఇవ్వాల్సి వస్తోందని, పిల్ల తల్లులకు ఒక గది కూడ లేదని వాపోతున్నారు. కనీసం కూర్చోవడానికి తగిన కుర్చీలు, తాగేందుకు మంచినీరు, బాత్రూంలు కూడా లేకపోవడంతో వృద్ధులు, ఇతర పనుల మీద వచ్చే మహిళలు,విద్యార్థులు, ఎండకు, వానకు ఆరు బయటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
కింది ఉద్యోగులు ఎలా చెబితే అలా
కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది ఎలా చెబితే అలా నడుస్తున్నదని ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సైతం మధనపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన ఫైలు,గ్రామాల్లో రైతులకు ఇచ్చే భూ సర్వే నోటీసులు కార్యాలయంలో రోజువారీ సంతకాలు కూడా పెట్టని అనధికార సిబ్బందికి ఇ లాంటి పనులు ఎలా చెబుతారని,ఒక వేళ పత్రాలు పోతే ఎవరు సమాధానం చెపుతారని వారిని వెంటనే కార్యాలయం నుంచి తొలిగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి కింది స్థాయి సిబ్బంది (ప్రైవేట్) మాట వినకపోవడం వల్లే వలపన్ని ఆ అధికారిని పట్టించినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.అంటే కింది స్థాయి సిబ్బంది పై అధికారులను కూడా బెదిరించే స్థాయికి ఎదిగారంటే కార్యాలయం పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు.
ఉన్నతాధికారులు స్పందించాలి..
కార్యాలయంలో అవినీతికి తావ్వివకుండా ఉండాలంటే వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.అవినీతికి పాల్పడి కార్యాలయానికి చెడ్డపేరు తెస్తున్న సిబ్బంది, మధ్యవర్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తాసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
అక్రమాల అరికట్టడంలో విఫలం..
కార్యాలయంలో తన కండ్ల ముందే కింది స్థాయి ఉద్యోగులు చేస్తున్న అక్రమాలు అరికట్టడంలో తాసీల్దార్ విఫలమయ్యారని బహిరంగా విమర్శలు వినిపిస్తున్నాయి.సిబ్బంది వసూలు చేసే అవినీతి సొమ్ములో పై స్థాయి ఉద్యోగస్తులకు కూడా వాటా లు అందుతున్నాయని,అందుకే వారు నోరు మెదపడం లేదనే బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కూడా దళారులు (మధ్యవర్తులు)హవా ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. మొదట స్లాట్ బుక్ చేసుకున్న ఫైళ్లు కాకుండా వారు చెప్పిన వాటినే ముందుగా రిజిస్టేషన్ చేస్తున్నారన్నారు. దీంతో ముందుగా వచ్చిన వారికి ఎండలో నిరీక్షణ తప్పడం లేదని,తమ భూముల అమ్మకాలు కొనుగోళ్లలో కూడా దళారులను సంప్రదించిక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవకతవకలు నా దృష్టికి రాలేదు..
నేను చండూరుకు బదిలీపై వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. ప్రైవేటు ఉద్యోగులను అవసరాల నిమిత్తం ఇక్కడ పనిచేయించు కుంటున్నామే తప్ప ,వారికి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలను ఇవ్వడం లేదు. కార్యాలయంలో పనికోసం వచ్చిన వారిని ఎవరైనా డబ్బులు అడిగితే, మా దృష్టికి తెస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.
-రమాకాంత్ శర్మ, తాసీల్దార్, చండూరు
సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణమో..
ఉద్యోగ రీత్యా నా భార్య ఆమె పనిచేసే కార్యాలయంలో సమర్పించాల్సిన ఓ ధృవీకరణ పత్రంలో పుట్టిన తేదీ తప్పుగా పడింది. దానిని సరిచేసేందుకు తగిన పత్రాలన్నీ సెక్షన్లో అందజేసినా అది సరిచేసి ఇవ్వడానికి 4నెలల సమయం పట్టింది. మా లాంటి చదువుకున్న వారికే ఇంత నిర్లక్ష్యంగా కార్యాలయంలో పనులు జరిగితే సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి పేర్కొన్నారు.
ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు..
తాసీల్దార్ కార్యాలయంలో రైతులు స్లాట్ బుక్ చేసుకొని పట్టా మార్పిడి కోసం వస్తే కంప్యూటర్ ఆపరేటర్లు ఫైలుకు రూ.500 నుంచి రూ.1000ల వరకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఏ పని కావాలన్నా దళారులు,ప్రైవేట్ ఉద్యోగులదే హవా. పని నిమిత్తం కార్యాలయానికి వస్తే ఉద్యోగులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. అలాగే సమయపాలన పాటించడం లేదు. మున్ముందు ఇలాగే కొనసాగితే కార్యాలయం ఎదుటే ధర్నా చేస్తాం.
-జెర్రిపోతుల ధనుంజయ, సీపీఎం మండల కార్యదర్శి, చండూరు