చండీగఢ్: కోర్టు ఉత్తర్వుల మేరకు అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు పోలీసులతో కలిసి యజమానురాలు ప్రయత్నించింది. అయితే కిరాయికి ఉంటున్న న్యాయవాది ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Lawyer Shoot Woman) కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 42లోని ఒక ఇంటిని కోర్టు ఆదేశాల మేరకు ఖాళీ చేయించేందుకు పోలీసులు, అధికారులు శనివారం అక్కడకు చేరుకున్నారు.
కాగా, ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న న్యాయవాది జేపీఎస్ చాధా డోర్ తీయలేదు. పైగా ఇంటి లోపల నుంచి లైసెన్స్ ఉన్న డబుల్ బ్యారెల్ షాట్గన్తో కాల్పులు జరిపాడు. ఇంటి యజమానురాలైన మంజిందర్ కౌర్ నోటిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె తీవ్రంగా గాయపడటంతో పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఇంటి యజమానురాలిపై కాల్పులు జరిపిన న్యాయవాది జేపీఎస్ చాధాను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు నేర స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించినట్లు వివరించారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.