గణపురం, మార్చి 2 : తెలంగాణ పల్లెలను హరితవనాలు తీర్చిదిద్దే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలు నేడు ఏడారిని తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో తీరొక్క చెట్లతో ఏపుగా ఎదిగి, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారిన వనాలు ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో మోడువారిపోతున్నాయి. నాడు పసిబిడ్డల్లా సాకిన మొక్కలు.. నేడు నిర్వహణ కరువై ఎండిపోతున్నాయి.
జయశంకర్ భూ పాలపల్లి జిల్లా గణపురం మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొకలు, పిల్లల ఆట వస్తువులతో బృం దావనాలను తలపించిన పల్లె ప్రకృతి వనాలు ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారా యి. రాత్రింబవళ్లు వీటిలో మద్యం ఏరులై పారుతుండగా, పేకాట రాయుళ్లకు ఇవి సురక్షిత స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి. వనాల్లో ఎకడ చూసినా మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లే దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని ‘మద్యం వనాలు’గా మారుస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిచి, కక్షపూరిత రాజకీయాలను పకనపెట్టి, ప్రజాధనంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలను సంరక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
