Vikas Raj | హైదరాబాద్, ఆగస్టు 13 : శనివారం గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి రవాణా, ఆర్ అండ్ బి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ పరిశీలించి, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్ షామియానాలు, వాటర్‌ప్రూఫ్ జనరేటర్, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, బారికేడింగ్, గ్యాలరీలు, వచ్చే అతిథులు, విద్యార్థులు, ప్రజల సీటింగ్ సామర్థ్యం, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లను ఉన్నతస్థాయి అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.
కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా ప్రోటోకాల్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. అదేవిధంగా స్టేజీ ఏర్పాటుతో పాటు సుందరీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి వాహనంలో వచ్చే పిల్లలకు ఒక లైజనింగ్ అధికారి తప్పనిసరిగా ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పంద్రాగస్టు రోజున గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పక్కాగా.. వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రికి సమర్పించే పోలీసుల గౌరవ వందనం, పోలీస్ కవాతును ఆయన ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, సమాచార శాఖ కమిషనర్ జి. ముకుంద రెడ్డి, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, సీపీ సజ్జనార్, అడిషనల్ సీపీ తప్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ కమలాసన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, చీఫ్ ఇంజనీర్ రాధా కిషన్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ జయ రామమూర్తి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న, ఆర్డీవో రామకృష్ణ, డీఈఓ యాదయ్య, ఆర్ అండ్ బి, విద్యుత్, వైద్య, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు