రాంచి: టీచర్ ట్రాన్స్ఫర్ నిలిపివేయాలంటూ ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులు నిరసనబాట పట్టారు. రోడ్డును దిగ్బంధించారు. ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనం ధ్వంసం చేశారు. దీంతో అక్కడి నుంచి పారిపోయిన ఆ అధికారి పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు. (Gen Alpha students protest) జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీని నిలిపివేయాలంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా నిరసన చేస్తున్నారు. ఆ టీచర్ ట్రాన్స్‌ఫర్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కండి బ్లాక్ వరకు వారి ఆందోళన వ్యాపించింది.
కాగా, గురువారం రోడ్డు దిగ్బంధించి నిరసన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ అధికారి పింకు పాండే అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిపై చేయి చేసుకోవడంతో వారు ఆగ్రహం చెందారు. పింకు పాండే వాహనాన్ని విద్యార్థులు ధ్వంసం చేశారు. భయాందోళన చెందిన ఆ అధికారి అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు.
మరోవైపు విద్యార్థుల నిరసన గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతానికి అదనపు పోలీస్ బలగాలను పంపుతున్నట్లు చెప్పారు. నిరసన విరమించేలా విద్యార్థులను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.