– ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 13 : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను తక్షణమే విడుదల చేయాలని, ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలల్లోనే నిలిపివేసి తీవ్రంగా వేధిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపడం అన్యాయమన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు కాగా, వాటిని విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు,మెమోలు, ఇతర విద్యా పత్రాలను కళాశాలలు తమ వద్ద ఉంచుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సర్టిఫికెట్లను ఎలాంటి షరతులు లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల చదువును బాధ్యతగా చూడాలి తప్ప, ప్రైవేట్ కళాశాలల ఆర్థిక ప్రయోజనాలకు విద్యార్థులను బలిచేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్, మాదాసు అఖిల్, జిల్లా కమిటీ సభ్యులు కేస సందీప్, బొల్లి తేజ , సాయి సంతోష్, ముదిగొండ ప్రశాంత్ పాల్గొన్నారు.