పంట చేలల్లో కలుపు నివారిణిగా మార్కెట్లోకి వచ్చి, కాలకూట విషంగా మారిన గడ్డి మందు నిషేధానికి పోరాటం మొదలైంది. మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుండడం, మనిషికి ప్రాణాంతకంగా మారుతుండడంతో లక్ష్మీపూర్ ఒక అడుగు ముందుకేసింది. ఈ మందుతో అనర్థాలు ఎక్కువగా ఉండడం, కొన్నేళ్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఈ మందు తాగుతున్నవారే ఎక్కువగా ఉంటుండడంతో ఆందోళన చెంది ఒక నిర్ణయం తీసుకున్నది. ఊరంతా ఏకమై గ్రామంలో నిషేధం విధించి, మార్చి ఒకటి నుంచే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అదే బాటలో చెర్లపల్లి, బొమ్మెన గ్రామాలు పయనిస్తున్నాయి. డైక్లోరైడ్ ఫార్ములాతో తయారు చేసిన ఈ గడ్డిమందు అత్యంత విషపూరితమని, దీని అమ్మకాలను పూర్తిగా నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో కొడుకు ఫొటోతో కనిపిస్తున్న చిర్ర లక్ష్మిది జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్. భర్త పేరు లక్ష్మీరాజం. ఇద్దరు బిడ్డలు. ఒక కొడుకు లవణ్ (27). చదువులో చురుగ్గా ఉండే లవణ్ కరీంనగర్లో ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. రెండేండ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలో వ్యవసాయం చేయడం ఆరంభించాడు. చెల్లె పెళ్లి చేశాడు. అంతా బాగానే సాగుతున్న సమయంలో ఒకరోజు లవణ్ ఒక రోజు ఐదు మిల్లీ లీటర్ల గడ్డిమందు (ప్యారాక్వాట్) తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.

ఒక్క మూతడే తాగానని లవణ్ చెప్పడంతో ఏమి కాదని అందరూ అనుకున్నారు. దవాఖానలో సైతం లవణ్ యాక్టివ్గానే కనిపించాడు. మూడో రోజు మృతిచెందాడు. ఇది జరిగి ఐదేళ్లు గడిచినా ఈ షాక్ నుంచి అతడి కుటుంబ సభ్యులు ఇప్పటికీ తేరుకోలేదు. లవణ్ ఒక్కడే కాదు, లక్ష్మీపూర్‌లో ఏలేటి గంగారెడ్డి, ఎడ్మల రాంమోహన్‌రెడ్డి, హన్మంతరెడ్డి, మతులాపురం రాజం, గర్వందుల శ్రీనివాస్‌గౌడ్.. ఇలా చాలా మంది గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఒక్క ఊరే కాదు, అంతర్గాం గ్రామంలో పదిహేను మంది, గొల్లపల్లి, గుంజపడుగు గ్రామాల్లో చాలా మంది రైతులు, పిల్లలు, యువకులు ప్రాణాలు తీసుకున్నారు.
జగిత్యాల, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : పంట చేలల్లో పెరిగే గడ్డిని సమూలంగా మట్టుపెట్టేందుకు డైక్లోరైడ్ ఫార్ములాతో తయారు చేయబడిందే పారాక్వాట్. ఈ గడ్డిమందు అత్యంత ప్రమాదకరమైంది. విషపూరితమైనది. దీనిని వినియోగిస్తే గడ్డి పూర్తిగా మాడిపోతుండగా.. దీని వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నది. తెలంగాణ పల్లెల్లోనూ ఎక్కువగానే ఉన్నది. దీని వల్ల తీవ్ర దుష్పలితాలు కలుగుతుండగా, పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతున్నది. పంటలతోపాటు నేలను దెబ్బతీస్తున్నది. ఇదే సమయంలో ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతున్నది. పారాక్వాట్‌ను కలపు నివారణకే కాదు, ఎంతో మంది రైతులు, ప్రజలు దీనిని ఆత్మహత్యలు చేసుకునేందుకు ఎంచుకుంటున్నారు. ఇతర రసాయనాలు తాగితే బతికే అవకాశాలు కొంత మేరకు ఉన్నా ఇది తాగితే ఏ మాత్రం బతికే అవకాశాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఇది తాగిన వారికి యాంటిడోట్ లేదని, మూడు మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో తాగితే మనిషికి చావు తప్ప వేరే దారి లేదని చెబుతున్నారు. ఇది గొంతులోకి వెళ్లగానే అన్నవాహిక పూర్తిగా కాలిపోతుందని, తదుపరి కిడ్నీలు, లివర్ చెడిపోతాయని, శరీరం మొత్తానికి విషం వెళ్లిపోతుందని వివరిస్తున్నారు. మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా బతికే అవకాశం ఉండదని, మొదట కొంత బాగానే ఉన్నట్టు కనిపించినా రెండు నుంచి పది రోజుల వ్యవధిలో చనిపోతాడని స్పష్టం చేస్తున్నారు. ఈ మందు తాగడమే కాదు, పిచికారీ చేసే సమయంలోనూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. శరీరంపై పుండ్లు, ఇన్ఫెక్షన్లపై ద్రవం పడితే వాటి గుండా రక్తంలో చేరి మనిషి చావుకు కారణమవుతుందని చెబుతున్నారు. అలాగే సరైన మాస్క్‌లు ధరించకపోతే, పెదవులు, శ్వాస, స్వేదరంద్రాలు, చెవుల ద్వారా సైతం శరీరంలోకి చేరి నష్టం చేస్తుందని చెబుతున్నారు. ఏ విధంగా చూసినా గడ్డిమందు అత్యంత ప్రమాదకరమైందని హెచ్చరిస్తున్నారు.
అత్యంత ప్రమాదకరమైన డైక్లోరైడ్ ఫార్ములాతో తయారైన గడ్డిమందుతో తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దీంతో దాదాపు 75 దేశాలు చాలా ఏళ్ల కిందనే తయారీ, వినియోగాన్ని నిషేధించాయి. శ్రీలంక, పాకిస్తాన్, చైనా, థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయిల్ యూరప్ ఖండంలోని అన్ని దేశాల్లోనూ బ్యాన్ చేశారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న దేశాలు గడ్డిమందు తయారీని, వినియోగాన్ని నిషేధించినా.. మనదేశంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ గడ్డిమందు ప్రాణాంతకమని తెలిసినా మార్కెట్లో విరివిగా విక్రయిస్తున్నారు. రైతులకు మాత్రమే అమ్మాల్సి ఉన్నా.. డబ్బులు తీసుకుని ఎవరు అడిగితే వారి చేతిలో పెడుతున్నారు. ఇంత సులువుగా దొరుకుతుండడంతో ఆత్మహత్యలకు పాల్పడే వారు దీనినే ఎంచుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న గడ్డిమందును కట్టడి చేయకపోతే మరింత ప్రాణనష్టానికి కారణం కావచ్చనే అభిప్రాయం వినిపిస్తున్నది.
గడ్డిమందు నిషేధంపై జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామస్తులు ఒకడుగు ముందుకు వేశారు. గడ్డిమందుతో ఎక్కువగా అనర్థాలే జరుగుతుండడం, ఇది భూమిలోని జీవానికి, భూమిపై మానవాళికి పెను ప్రమాదంగా మారుతుండడం, గ్రామంలో పది మంది వరకు మంది ఈ మందుతాగే ఆత్మహత్యలు చేసుకోవడంతో ఒక ఆలోచన చేశారు. ఊరంతా ఏకమై ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో గడ్డిమందును పూర్తిగా వినియోగించకూడదని తీర్మానించారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు, చివరకు గ్రామంలో పెండ్లిలు, శుభకార్యాలు జరిగినా, ప్లాస్టిక్ విస్తర్లను, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. పదిహేను రోజులపాటు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. అలాగే దుకాణాదారులను సైతం పిలిచి విషయాన్ని తెలియజేశారు. ప్లాస్టిక్ వస్తువులు విక్రయించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వినియోగించిన వారి వివరాలు చెబితే వారికి 250 పారితోషికంగా ఇస్తామని ప్రకటిస్తూ, మార్చి ఒకటి నుంచే అమల్లోకి తెచ్చారు. లక్ష్మీపూర్తోపాటు చెర్లపల్లి, బొమ్మెన తదితర గ్రామాల్లోను గడ్డిమందు వినియోగాన్ని నిషేధిస్తూ తీర్మానాలు చేపట్టారు. అదే బాటలో చెర్లపల్లి, బొమ్మెన గ్రామస్తులు కూడా కదులుతున్నారు. కాలకూట విషమైన గడ్డిమందును అన్ని గ్రామాలు కూడా నిషేధించాలని పిలుపునిస్తున్నారు.
ఇప్పటికే మా లక్ష్మీపూర్‌లో చాలా మంది గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు మందు వినియోగించే సమయంలో ప్రమాదానికి గురయ్యారు. అందరికీ అందుబాటులో ఉండడం వల్ల చిన్న సమస్యలకే మందు తాగుతున్నారు. ఇది సరికాదనిపించింది. అలాగే ప్లాస్టిక్ వల్ల సైతం నష్టం ఉందన్న విషయాన్ని గుర్తించాం. గ్రామాన్ని కాపాడుకోవడంతోపాటు భవిష్యత్తు తరాలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సమష్టిగా అమలు చేసేందుకు కృషి చేస్తాం.
గడ్డి మందు అంటే నథింగ్ బట్ సైనెడ్. ఇది తాగిన వారికి మరణం తప్ప మరోటి లేదు. 5 ఎంఎల్‌కు మించి తాగితే బతికే అవకాశం లేదు. ఎంత వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలో గడ్డిమందు తాగి నిత్యం పదుల సంఖ్యలో జనం మృతిచెందుతున్నారు. వాస్తవానికి డైక్లోరైడ్ ఫార్ములా మందును బ్యాన్ చేయాలి. దురదృష్టవశాత్తూ మనదేశంలో చేయబడలేదు. రైతుల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 30 గ్రామాల్లో ఏర్పాటు చేసి వివరించా. ఇంకా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. రైతుల్లోను, ప్రజల్లోను అవగాహన తెచ్చి దీన్ని బ్యాన్ చేయించేలా ఒత్తిడి తేవాలన్నది మా ప్రయత్నం. పాలకులు, అధికారులు సైతం ఈ దిశగా ఆలోచనలు చేయాలి.