Hormones | ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు కడుపు నొప్పి, అలసట, ఉబ్బరం, మూడ్ స్వింగ్స్, తీపి పదార్థాలపై కోరిక వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. హార్మోన్లలో మార్పులు, రక్తస్రావం, కండరాల సంకోచాల కారణంగా ఈ సమయంలో శరీరానికి ఐరన్, మెగ్నిషియం వంటి కొన్ని పోషకాలు మరింత అవసరం అవుతాయి. అయితే రోజువారీ ఆహారంలో పాటించే కొన్ని అలవాట్లు ఈ అసౌకర్యాలను మరింత పెంచే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, అలసట ఉన్నప్పుడు చాలామంది టీ లేదా కాఫీపై ఆధారపడుతుంటారు. కెఫీన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల క్రాంప్స్, అలసట మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కెఫీన్లో ఉండే టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. రక్తనాళాల సంకోచానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా వెచ్చని వాము నీటిని తీసుకోవడం ఒక ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు.
పీరియడ్స్ సమయంలో హార్మోన్ల స్థాయిలు తగ్గడం వల్ల మూడ్‌ను ప్రభావితం చేసే మెదడులోని రసాయనాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో కార్బొహైడ్రేట్లను పూర్తిగా మానేయడం వల్ల మూడ్ స్వింగ్స్, శక్తి తగ్గడం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వేడిగా, తేలికగా తీసుకునే బజ్రా ఖిచ్డీ లేదా రాజ్గిరా వంటి ఆహారాలను చిన్న మొత్తంలో తీసుకోవచ్చు. పీరియడ్స్ సమయంలో తీపి పదార్థాలపై తీవ్రమైన కోరిక కలగడం కూడా సాధారణమే. ఇలాంటి సమయంలో ప్రాసెస్ చేసిన చాక్లెట్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, మొటిమల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. చాక్లెట్లకు బదులుగా వేయించిన శనగలు లేదా నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. అలాగే నువ్వుల బెల్లం లడ్డూలను కూడా ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
పీరియడ్స్ సమయంలో జీర్ణక్రియపై కూడా దృష్టి పెట్టాలి. ఈ సమయంలో శరీరానికి వేడి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం అవసరమవుతుంది. పచ్చి లేదా చల్లని ఆహారాలను జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. దీంతో కొందరిలో కడుపు అసౌకర్యం లేదా క్రాంప్స్ మరింత ఇబ్బంది పెడుతుంది. అందువల్ల చల్లని సలాడ్లకు బదులుగా వేడి మసూర్ దాల్ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో విపరీతమైన అలసట, నీరసం అనిపించినప్పుడు దాన్ని సాధారణంగానే తీసుకోకూడదు. రక్తస్రావం కారణంగా శరీరంలోని ఐరన్ నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది. ఐరన్ అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడేందుకు నిమ్మరసంతో కలిపిన నీటిలో నానబెట్టిన ఒక టేబుల్‌స్పూన్ హాలిమ్ విత్తనాలను తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో ఆహారపు అలవాట్లు కూడా శారీరక అసౌకర్యంపై ప్రభావం చూపిస్తాయి. అధికంగా టీ, కాఫీ తీసుకోవడం, కార్బొహైడ్రేట్లను పూర్తిగా మానేయడం, ప్రాసెస్ చేసిన చాక్లెట్లను ఎక్కువగా తినడం వంటి అలవాట్లకు బదులుగా వెచ్చని, సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు కలిగిన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా ఈ సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించవచ్చు.