RBI UDGAM : దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మర్చిపోయిన, క్లెయిమ్ చేసుకోని సొమ్ము విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పార్లమెంట్లో ఆర్థిక శాఖ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 31, 2026 నాటికి దేశంలోని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము రూ.98,073. దీనికి సంబంధించిన వివరాల్ని గతంలోనే వెల్లడించింది. ఈ సొమ్మును గురించి తెలుసుకునేందుకు అవకాశాలు కూడా కల్పించింది. ఇందుకోసం ఆర్బీఐ ఉద్గామ్ (UDGAM) అనే పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఈ పోర్టల్ ద్వారా ఎవరైనా తమకు సంబంధించిన లేదా మర్చిపోయిన లేదా మరణించిన తమ వారి బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఇలా క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఈ డబ్బును ఆర్బీఐ.. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి తరలించింది. ఈ డబ్బు గురించి కస్టమర్లు చింతించనవసరం లేదు. ఈ నిధిలో మిగిలిపోయిన డిపాజిట్లను సంబంధిత వ్యక్తులు క్లెయిమ్ చేసుకోవచ్చు. సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించి, తమ డబ్బు అందడానికి కావాల్సిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతే.. ఆ డబ్బు వారికి అందుతుంది. చాలా మంది తమ డబ్బును రహస్యంగా దాచుకోవడం కోసం తమవారికి తెలియకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. అలాంటి వారు వాటి వివరాల్ని మర్చిపోవచ్చు.
లేదా వారు మరణించి ఉండొచ్చు. దీంతో ఆ డబ్బు బ్యాంకులో అలాగే, నిలిచిపోతుంది. ఒక బ్యాంకులో రెండేళ్లకంటే ఎక్కువ కాలం డిపాజిట్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీ జరగకుంటే ఆ ఖాతాను నిర్వహణలో లేని లేదా నిలిచిపోయిన ఖాతాగా గుర్తిస్తారు. ఆ తర్వాత పదేళ్లపాటు ఆ ఖాతాను ఎవరూ క్లెయిమ్ చేసుకోకుంటే ఆ నిధిని డీఈఏకు తరలిస్తారు. ఈ డబ్బు బదిలీ అయినంత మాత్రాన సంబంధిత వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు, చట్టబద్ధమైన అర్హతదారులకు చెందకుండా పోదు. సరైన పత్రాలతో అర్హులు ఆ డబ్బును ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకులను సంప్రదించి ఆ డబ్బును పొందవచ్చు. బ్యాంకులకు ఆర్బీఐ ఆ డబ్బును తిరిగి చెల్లిస్తుంది.
ఇందుకోసం ఆర్బీఐ ఉడ్గాం పోర్టల్‌ను సందర్శించి, తమ డిపాజిట్ల గురించి తెలుసుకోవచ్చు. అయితే, ఇది వివరాలు తెలుసుకునేందుకు సంబంధించిన పోర్టల్ మాత్రమే. మీ డబ్బు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ అయినట్లు ఈ పోర్టల్‌లో గమనిస్తే, దానికి సంబంధించిన బ్యాంకును సంప్రదించాలి. నిబంధనల ప్రకారం క్లెయిమ్ చేసుకోవాలి.