హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పనితీరుపై ధ్వజమెత్తారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను బంద్ చేయాలనే కుట్ర బయటపడటంతో ఆ తప్పును అధికారులపైకి నెట్టే ప్రయత్నం మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మీ తప్పులకు ప్రభుత్వ అధికారులు బలి కావాలా? తప్పు మీరు చేస్తే శిక్ష వారు అనుభవించాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.22ఏ నిషేధిత భూముల విషయంలో భూదందా వెలుగులోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti ) ‘సారీ’’ అంటూ తప్పించుకుని, అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న అంశాల్లో సరిదిద్దుకోలేని తప్పు చేసి, ‘సారీ’ చెప్పి తప్పించుకుంటే సరిపోదని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యంపై చర్యలు తీసుకోవాలి
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇక రావేమోనని పేదలు ఆందోళన చెందుతున్నారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంతో ఎంతోమంది మానసిక వేదనకు గురయ్యారు. బాధ్యులైన అధికారులపై మీరు చర్యలు తీసుకోవడం కాదు. మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వ వైఫల్యంపై ముందు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.ప్రభుత్వ అధికారులపై మీరు సీరియస్‌గా ఉండటం కాదు.. తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వంపై సీరియస్‌గా ఉన్నారు.కర్రు కాల్చి వాత పెట్టేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.మీరు ఎన్ని సార్లు సారీ చెప్పినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు.
కళ్యాణ లక్ష్మి పథకం ఆగకూడదని, రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా నుంచి భూహక్కు దారుల భూములను తొలగించి, వారికి పూర్తి హక్కులు కల్పించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీ లాంటి ప్రాంతాలను సైతం ప్రొహిబిషన్ లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
22A అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారిందని, రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా, 22A నుంచి భూమిని బయటకు తీయాలన్నారు. 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని అన్నారు. 30 శాతం కమీషన్ లేనిదే రెవెన్యూ శాఖలో ఒక్క ఫైల్ కూడా కదలడం లేదని ఆరోపించారు. చివరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. తన సొంత ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందని ఆరోపించారు.