కరీంనగర్ తెలంగాణచౌక్, మార్చి 2 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మున్సిపల్ కార్మికులు భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో జిల్లాకేంద్రానికి తరలివచ్చి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని, డీఏ చెల్లించాలని, కార్మికులు మరణిస్తే దహన ఖర్చు 30 వేలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో డీఏ ఇవ్వాలని, ఉద్యోగ విరమణ పొందిన రోజే పదవి విరమణ బెనిఫిట్స్‌ను అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ (సీఐటీయూ) అనుబంధ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ, మున్సిపల్ సమస్యలను పరిష్కరించండంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహించారు. ప్రతి కార్మికుడికి కనీస వేతనం 23వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న జీవోలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో జారీ చేయాలన్నారు. నగరంలో విధుల నుంచి తొలగించిన 55 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. నాయకులు బుజ్జమ్మ, రవి, మల్లేశం, శ్యాంసుందర్, సరోజన, అంజయ్య పాల్గొన్నారు.