ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 29, 2020 , 02:24:14

సోషల్‌ మీడియాపై పోలీసు నిఘా

సోషల్‌ మీడియాపై పోలీసు నిఘా

  • n ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు  
  • n గ్రూప్‌ అడ్మిన్లపై నాన్‌బెయిలబుల్‌ కేసులు..
  • n ఈ యేడాది 10 మందిపై కేసులు.. 25 మంది బైండోవర్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : సోషల్‌ మీడియా.. ప్రస్తుత పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యంత వేగంగా సమాచారాన్ని చేరవేయగల సాధనం. సామాన్య ప్రజల చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. సరైన వసతులు లేని గ్రామాల్లోనూ ఏర్పడిన నెట్‌వర్క్‌ల వలలో సామాజిక మాధ్యమాల వినియోగం మరింతగా పెరిగింది. ఏ సమాచారానైనా క్షణాల్లో చేరవేసే వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రాంలాంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మంచి ఆలోచనతో వినియోగిస్తే ఎంతటి ప్రయోజనమో.. చెడు ఆలోచనలతో వినియోగిస్తే అంతకంటే ప్రమాదం ఉంది.  ఇంతటి ప్రభావవంతమైన సోషల్‌ మీడియాను ప్రతికూల ప్రభావం చూపేలా వినియోగించే వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టి.. కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి పోస్టింగ్‌లనైనా నిశితంగా గమనిస్తున్నారు. అసత్యాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

వ్యక్తిపై, గ్రూప్‌ అడ్మిన్‌పై కేసు..

కల్పితమైన విషయాలు, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారే కాకుండా గ్రూప్‌ అడ్మిన్లపైనా సైబర్‌ యాక్ట్‌ కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయనున్నారు. మతపరమైన వైషమ్యాలు రెచ్బగొట్టే కేసులు నమోదైన వ్యక్తులపై కమ్యునల్‌ షీట్‌ ఓపెన్‌ చేస్తారు. విద్యార్థులు, యువకులపై ఒకసారి ఇలాంటి కేసులు నమోదైతే వారు భవిష్యత్తులో ఉద్యోగాలకు అనర్హులవుతారు. ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం గాని ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారి పాస్‌పోర్టు, వీసా పొందడానికి అనర్హులవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనాలోచిత, అవాస్తవమైన విషయాలను నమ్మి కేసుల్లో ఇరుక్కొని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. logo