Sand Mining | మాగనూరు, జూన్ 27: నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచువార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి అక్రమంగా ఇసుకను తరలించేందుకు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రణాళిక వేసింది.
శుక్రవారం జిల్లాలోని మాగనూర్ పెద్ద వాగు నుండి టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేసేందుకు సంస్థ సిబ్బంది, మాగనూరు పెద్దవాగు వద్దకు చేరుకున్నారు. మండల కేంద్రం బ్రిడ్జి సమీపంలోని పెద్ద వాగు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించేందుకు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వాగు వద్దకు చేరుకొని టిప్పర్లను అడ్డుకున్నారు.
మాగనూరు పెద్ద వాగు నుండి ఇసుకను తరలించేది లేదని గ్రామస్తులు భీష్మించారు. కొన్నాళ్లుగా ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా ఇసుకను తరలించడంతో సాగునీరు, త్రాగునీరుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, రాబోయే కాలంలో మరింత కష్టాలను చూడాల్సి వస్తుందని అధికారులతో వాదించారు. మాగనూరు మండల కేంద్రం నుండి కాకుండా ఆన్లైన్లో టీజీ ఎండీసీ నడిచే చోటు నుండి ఇసుకను తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ఎలాంటి పర్మిషన్ లేకుండా వాగు నుండి ఇసుకను తరలించేందుకు..
పెద్ద వాగు నుండి ఇసుకను తరలించ వద్దని శుక్రవారం ఉదయం గ్రామస్తులంతా కలిసి స్థానిక తహసిల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కాగా మధ్యాహ్నానికే ఎలాంటి పర్మిషన్ లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ సిబ్బంది వాగు నుండి ఇసుకను తరలించేందుకు తమ వాహనాలతో వచ్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎస్సై అశోక్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. అధికారికంగా అనుమతులు లేకున్నప్పటికీ ఇసుక తరలింపును అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. చేసేదేమీ లేక ఈ విషయంపై తహసిల్దార్ నాగలక్ష్మికి సమాచారం చేరవేశారు. మాగనూరు పెద్దవాగు దగ్గరకు చేరుకొని ఇలా పనులను అడ్డుకోవడం మంచిది కాదని గ్రామస్తులతో తహసిల్దార్ కూడా వాగ్వాదానికి దిగారు. మీరు కాదంటే ఇసుక తరలింపు నిలిపివేస్తానని గ్రామస్తులతో తహసిల్దార్ చెప్పుకు వచ్చారు.
ఉన్నతాధికారులు ఫోన్ చేసి చెప్పడంతో..
మాగనూరు మండల కేంద్రంలో తప్ప ఇంకా ఎక్కడైనా కొట్టుకోవాలని గ్రామస్తులు తమ వాదనను గట్టిగా వినిపించారు. ఇదే విషయమై తహసిల్దార్ నాగలక్ష్మిని వివరణ కోరగా ప్రస్తుతం వారి వద్ద ఎలాంటి పర్మిషన్ లేదని అన్నారు. ఉన్నతాధికారులు ఫోన్ చేసి చెప్పడంతో శివారు వాగు నుండి ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అయితే అధికారికంగా ఎలాంటి పర్మిషన్ లేకుండానే వాగులో ఇసుక తరలించేందుకు రోడ్లు వేయడానికి పర్మిషన్ ఇచ్చిన సంబంధిత పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులపై ఎలాంటి పర్మిషన్ లేని దానికి ఇంత సపోర్ట్ ఎందుకని సంబంధిత అధికారులపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.