న్యూఢిల్లీ: చత్తీస్‌ఘడ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లాలో రైలు కూత వినబడే రోజు దగ్గరలోనే ఉన్నది. తెలంగాణ, చత్తీస్ఘడ్ మధ్య సుమారు 160 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్(Rail Network) నిర్మాణం కోసం తుది దశ సర్వే చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు తొలిసారి రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలోని కొత్తగూడం నుంచి చత్తీస్‌ఘడ్‌లోని కిరణ్డోల్కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సుమారు 160 కిలోమీటర్ల దూరం కోసం లొకేషన్ సర్వే చేపట్టారు.
అత్యాధునిక లైడార్ టెక్నాలజీ ద్వారా రూట్ సర్వే చేపట్టినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు మానిటర్ చేస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, జాతీయ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్య, ఆరోగ్యం, వాణిజ్యం, స్వయం సమృద్ధి దివగా బస్తర్ అడుగులు వేస్తుందని, దాని కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు. దీంట్లో సుమారు 138 కిలోమీటర్లు చత్తీస్‌ఘడ్‌లోనే ఉంటుంది. గిరిజన ప్రాంతాలే ఎక్కువగా ఉంటాయి.
చాలా చోట్ల సర్వే వర్క్ వేగంగా జరుగుతున్నా.. దంతెవాడ, బీజాపూర్‌లో మాత్రం అవరోధాలు ఎదురవుతున్నాయి. దంతెవాడలోని 26 కిలోమీటర్లు, బీజాపూర్‌లోని 35 కిలోమీటర్ల మేర సర్వే పూర్తి అయితేనే.. డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) సిద్దం చేయనున్నట్లు రైల్వే శాక చెప్పింది. డ్రోన్లు, విమానాల ద్వారా లైడార్ సర్వే నిర్వహించారు. ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో ఉన్న కొండలు, గుట్టలు, నదులు, అడవులను మ్యాపింగ్ చేయనున్నారు. డీపీఆర్ వచ్చాక రైల్వే ట్రాక్‌ల నిర్మాణం ప్రారంభించనున్నారు.