కొత్తగూడెం గణేష్టెంపుల్, ఫిబ్రవరి 16: బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ భవన్లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్లో అధికారపక్షం చేసే తప్పులను గుర్తించి ఎప్పటికప్పుడు నిలదీయాలన్నారు. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండా ప్రజా విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టొద్దన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా బీఆర్ఎస్ను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళిలర్పించి ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను బహిష్కరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు సింధుతపస్వి, బీమా శ్రీవల్లి, వేల్పుల వీరమ్మ, సాగర్, రాంబాబు, స్వప్నకుమారి, బత్తుల మధు చందు, గుణచరిత్ పాల్గొన్నారు.