Air India plane crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Air India plane crash)పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు (Air India plane crash victims) ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ (Tata Sons) నిర్ణయించింది. ఇందుకోసం బోర్డును అనుమతి కోరినట్లు తెలిసింది. ఈ ట్రస్ట్‌కు రూ.500 కోట్లు కేటాయించేలా (Rs 500 crore trust) అనుమతి కోరినట్లు సమాచారం. జూన్ 12న జరిగిన విషాదం తర్వాత గురువారం జరిగిన మొదటి బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ఈ ట్రస్ట్‌కు కేటాయించే సొమ్ముతో ప్రమాదంలో మరణించిన 271 బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. అంతేకాదు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, ప్రమాదం జరిగిన సమీపంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ పునరుద్ధరణ, విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం వంటి పనులు ఈ ట్రస్ట్ ద్వారా చేపట్టనున్నారు. మిగిలిన మూల ధన సొమ్మును బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలు తీర్చేందుకు వినియోగించాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ట్రస్ట్‌ను రిజిస్టర్ చేసి.. దేశ, విదేశాల్లోని బాధితుల కుటుంబాలకు నేరుగా సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పీబీ బాలాజీ నేతృత్వం వహిస్తారు.
జూన్ 12న ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరింది. మధ్యాహ్నం 1:30 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ఇక విమానం మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలడంతో అందులోని కొందరు మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మొత్తం 270 మందికిపైగా మరణించారు. ఈ విమాన దుర్ఘటనను టాటా యాజమాన్యం చాలా సీరియస్‌గా తీసుకుందది. సంస్థకు ఈ ఘటన పెనుసవాలుగా మారడంతో ఛైర్మన్ చంద్రశేఖరన్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వంతో సంబంధాలు, ప్రయాణికుల భద్రత, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం వంటి కీలక అంశాలను ఆయన నేరుగా పర్యవేక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read..
Jagannath Rath Yatra | ప్రారంభమైన పూరీ జగన్నాథుని రథయాత్ర.. తరలి వచ్చిన భక్తజనం
Karnataka | విష ప్రయోగం.. ఐదు పులులు మృతి
Floods | హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. 250 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్