తల్లాడ, ఫిబ్రవరి 16: ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని, మేజర్లకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి గ్రామాలకు చెందిన రైతులు.. తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎన్నెస్పీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. నీటి విడుదలపై అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఆఫీసు గదికి తాళం వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా నాయకుడు శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సాగర్ కాల్వల ఆయకట్టు కింద వేసిన వరి పంటలకు నీరు అందకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే సిరిపురం, తెలగారం మేజర్లకు నీటిని విడుదల చేసి పంటలను రక్షించాలని కోరారు. కాగా.. నీటి విడుదల విషయమై కల్లూరు ఎన్పెస్పీ ఈఈని రైతు సంఘం నాయకుడు సత్యనారాయణరెడ్డి ఫోన్లో సంప్రదించగా.. రెండు గంటల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నల్లమోతు మోహన్‌రావు, సీపీఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, రైతులు పులి కృష్ణయ్య, గుండ్ల నాగయ్య, శనకాయల పెద్ద నరసింహారావు, ఏగుపాటి హనుమంతరావు, పాలవెల్లి ప్రసాద్, సాయిని ప్రకాశ్‌రావు, అనుముల కృష్ణయ్య, దగ్గుల భద్రారెడ్డి, హరీశ్‌రెడ్డి, బోడ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.