Vijay | తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఎట్టకేలకు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం చివరకు ప్రేక్షకుల ముందుకు రావడంతో తొలి షో నుంచే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్, ముఖ్యంగా టైటిల్ కార్డులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతి చిత్రంలోనూ కొత్తగా డిజైన్ చేసే టైటిల్ కార్డులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా ‘లియో’ సినిమాలో వచ్చిన టైటిల్ కార్డు ఆయన కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచిందని అభిమానులు భావిస్తుంటారు. అందుకే జన నాయగన్ లో విజయ్‌కు ఎలాంటి టైటిల్ కార్డు ఇస్తారనే ఆసక్తి ముందుగానే నెలకొంది. అయితే ఈ సినిమాలో దర్శకుడు విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకమైన టైటిల్ కార్డును రూపొందించారు. ‘లియో’ టైటిల్ కార్డు తరహా విజువల్స్‌తో పాటు, తమిళనాడు అసెంబ్లీలో విజయ్ చేసిన వైరల్ సిగ్నేచర్ హ్యాండ్ గెశ్చర్ని ఇందులో ఉపయోగించారు. గతంలో అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా విజయ్ చేసిన ఆ హ్యాండ్ మూవ్మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కాగా, దానినే ఇప్పుడు సినిమా టైటిల్ కార్డులో హైలైట్ చేయడం అభిమానులను ఉత్సాహపరిచింది.
అంతేకాదు, సాధారణ హీరో పేరుకు బదులుగా “Honourable Chief Minister of Tamil Nadu C. Joseph Vijay” అనే ప్రత్యేక టైటిల్‌ను ప్రదర్శించడం మరింత చర్చకు దారితీసింది. అభిమానులు దీనిని విజయ్ రాజకీయ ప్రయాణానికి గుర్తింపుగా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు కొందరు రాజకీయ వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి హోదాను సినిమా టైటిల్ కార్డులో ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే విడుదలైన తొలి షోల నుంచి ఈ టైటిల్ కార్డు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా విజయ్ అభిమానులు థియేటర్లలో ఈ సన్నివేశానికి భారీగా స్పందిస్తూ హర్షధ్వానాలు చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా కంటే ముందే ఈ టైటిల్ కార్డు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల ప్రశంసలు, రాజకీయ విమర్శల మధ్య ‘జన నాయగన్’ టైటిల్ కార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Vere level title card #JanaNayagan pic.twitter.com/5p7DrQ8dhw
— Sasank ᴼᴳ (@Sasankanupama) July 23, 2026