అసలే సూపర్‌స్టార్. పైగా రాజమౌళితో చేస్తున్నాడు. రేపు సినిమా విడుదలైతే పాన్ వరల్డ్ హీరోగా అవతరించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అందుకేనేమో ప్రస్తుతం నిర్మాతలంతా మహేశ్‌బాబు దగ్గరకు క్యూ కడుతున్నారు. ఈ డిసెంబర్‌తో ఆయన ‘వారణాసి’ షూటింగ్‌ని పూర్తి చేస్తారట. దాంతో మహేశ్‌బాబు నెక్ట్స్ సినిమా డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు పోటీపడుతున్నారట.
రీసెంట్గా మహేష్‌బాబుని మైత్రీ మూవీమేకర్స్ అధినేతలైన రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నేని కలిశారట. దర్శకులు, కథల గురించి ఆయనతో చర్చించారట. ప్రతిష్టాత్మక కన్నడ చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాతలు సైతం ముంబైలో మహేశ్‌ని కలిసి చర్చలు జరిపారట.
ఇదంతా ‘వారణాసి’ సినిమా ఎఫెక్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను అంతర్జాతీయ భాషల్లో భారీగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్‌బాబు మార్కెట్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే నెక్ట్స్ సినిమా తమదే కావాలని అగ్ర నిర్మాతలంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఫ్యాన్సీ ఆఫర్స్‌ని కూడా మహేశ్ ముందుంచుతున్నారు. మరి ఈ పోటీలో జాక్‌పాట్ కొట్టే నిర్మాత ఎవరో చూడాలి.