హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే రామకృష్ణారావు కొనియాడారు. 2014-26 మధ్య కాలంలో రాష్ట్ర బడ్జెట్ నాలుగు రెట్లు పెరగడమే కాకుండా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానానికి చేర డం గొప్ప విషయమని పేర్కొన్నారు. నాడు సీఎం కేసీఆర్ స్వల్పకాల వ్యవధిలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని శ్లాఘించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
శుక్రవారం హైదరాబాద్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన తెలంగాణ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) సదస్సులో రామకృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక వృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. స్వ రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో దాదాపు రూ. లక్ష కోట్లుగా ఉన్న తెలంగాణ తొలి బడ్జెట్.. ఈ ఏడాది రూ.3.24 లక్షల కోట్లకు చేరిందని, నాడు దాదాపు రూ.60 వేల కోట్లుగా ఉన్న వాస్తవ వ్యయం నిరుడు ఏకంగా రూ.2.4 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ జీడీపీ 3.5 రెట్లు వృద్ధిచెంది రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్లకు చేరుకున్నదని తెలిపారు.
2014 నాటికి తలసరి ఆదాయంలో 10వ స్థానంలో నిలిచిన తెలంగాణ నేడు రూ.4.3 లక్షల తలసరి ఆదాయంతో 3వ స్థానంలో నిలిచిందని, ప్రస్తుతం ఈ విషయంలో సికిం, గోవా మాత్రమే తెలంగాణ కంటే ముందున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ముందస్తు వ్యూహా లు చాలా కీలకమని, మారుతున్న సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), భౌగోళిక, రాజకీయ, అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా సీఎఫ్‌వోలు ముందే సిద్ధపడాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా సీఎఫ్‌వోలు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
దేశ జనాభాలో అధిక భాగం ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి మాత్రం దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నదని రామకృష్ణారావు విశ్లేషించారు. 1991లో ఆర్థిక సంసరణలు ప్రవేశపెట్టాక మానవ వనరులు, విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధికి దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఈ ఆర్థిక వేగానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన రోజు నుంచి అత్యధికకాలం (సుమారు 12 ఏండ్లు) రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావు దేశంలోనే అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 14 సార్లు రాష్ట్ర వార్షిక బడ్జెట్లను రూపొందించిన ఏకైక ఆర్థికశాఖ కార్యదర్శిగా రికార్డు సొంతం చేసుకున్నారు. జూన్ 30న పదవీ విరమణ పొందిన రామకృష్ణారావు ప్రస్తుతం ముఖ్యమంత్రికి సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.