Telugu Student | మిర్యాలగూడ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి తీవ్ర అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడి కన్నుమూసింది.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏసీఎస్ సల్కునూరు మాజీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కందిమల్ల లక్ష్మిరెడ్డి, పద్మ దంపతుల చిన్న కుమార్తె మాన్వితా రెడ్డి (26) హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లింది. స్నేహితులతో కలిసి ఉంటూ ఎంఎస్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైంది.
సెప్టెంబర్ 4న అకస్మాత్తుగా తీవ్ర గొంతు నొప్పితో అనారోగ్యానికి గురికావడంతో స్నేహితులు ఆమెను బాల్టిమోర్‌లోని దవాఖానలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు నాలుగో దశ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. సెప్టెంబర్ 13న చికిత్స కోసం దవాఖానలో ఇన్ పేషెంట్‌గా చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 1న మాన్వితారెడ్డి మృతిచెందింది.
కూతురు హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని భారతకు తరలించేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యత్నిస్తున్నారు.