రఘునాథపాలెం, ఆగస్టు 1 : ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్లు కూల్చివేసిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భూదాన్ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో బాధితులు శనివారం ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు డాక్టర్ భీంరావ్ యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల్లో నిరాశ్రయులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేదంటే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వెలుగుమట్ల విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి ఖమ్మం ఎంపీని నిలదీస్తామన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత విషయంపై నిజనిర్ధారణ కమిటీ వేసి పరిశీలించామని తెలిపారు.
కొందరు భూ బకాసురులు ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులను బ్లాక్ మెయిల్ చేసి కుట్రలకు పూనుకున్నట్లు వెల్లడైందన్నారు. దీనిపై హైకోర్టులో కేసులు వేశామని, సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి బాధితులందరికీ న్యాయం చేసేలా పోరాడుతామన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్, రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు, ఆర్పీ తెలంగాణ పార్టీ ఇన్చార్జి చంద్రకాంత్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల రాఘవేంద్ర, విఠల్, లక్ష్మీనారాయణ, భూదాన్ బాధితులు పాల్గొన్నారు.