October Movies | సినిమా ప్రేమికులకు అక్టోబర్ నెల ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. బాలీవుడ్, దక్షిణాది చిత్రాలతో పాటు హాలీవుడ్‌కు చెందిన పలు ఆసక్తికరమైన సినిమాలు ఈ నెలలో వరుసగా థియేటర్లలోకి రానున్నాయి. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, పీరియడ్ డ్రామా, బయోగ్రాఫికల్ కథాంశాలతో విభిన్నమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.ముఖ్యంగా అజయ్ దేవగన్ నటించిన ‘దృశ్యం: ది కంక్లూజన్’, టామ్ క్రూజ్ ‘డిగ్గర్’, రజినీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబలి’ వంటి భారీ చిత్రాలు అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో విడుదల కానున్న ముఖ్యమైన సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ నెల థియేట్రికల్ విడుదలలకు ‘దృశ్యం: ది కంక్లూజన్’తో శ్రీకారం పడనుంది. ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ మరోసారి విజయ్ సల్గాంకర్ పాత్రలో కనిపించనున్నారు. టబు, శ్రియా శరణ్, జైదీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సల్గాంకర్ కథకు ముగింపు పలకనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ‘డిగ్గర్’ కూడా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్యారితూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డార్క్ కామెడీ డ్రామాగా రూపొందింది. రిజ్ అహ్మద్, జాన్ గుడ్‌మ్యాన్, సాండ్రా హుల్లర్, జెస్సీ ప్లెమన్స్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఓ శక్తివంతమైన ఆయిల్ వ్యాపారవేత్తకు ఎదురయ్యే ప్రమాదం, దాని నుంచి బయటపడేందుకు అతను చేసే ప్రయత్నాల చుట్టూ కథ సాగుతుందని సమాచారం.
అక్టోబర్ 9న ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా నటించిన స్పై కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్’ విడుదల కానుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఓ పాకిస్తానీ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.
భారత్‌లో ఓ మిషన్‌లో ఉన్న సమయంలో అతడు జ్ఞాపకశక్తిని కోల్పోవడం, దాని చుట్టూ చోటుచేసుకునే పరిణామాలను హాస్యంతో మేళవించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సుహైల్ నయ్యర్ కూడా కీలక పాత్రలో నటించారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2023లో వచ్చిన ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. రజినీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు విశాల్, మమితా బైజూ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అక్టోబర్ 16న పలు ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబలి’ అందులో ప్రధానమైన చిత్రంగా నిలవనుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఇందులో కీలక పాత్రలో నటించినట్లు సమాచారం.
ఇదే రోజున ‘ప్రహార్: ది ఉజ్వల్ నికమ్ స్టోరీ’ కూడా విడుదల కానుంది. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా ఈ బయోగ్రాఫికల్ డ్రామాను రూపొందించారు. రాజ్‌కుమార్ రావు ఉజ్వల్ నికమ్ పాత్రను పోషించగా.. వామికా గబ్బి, సికందర్ ఖేర్, జైదీప్ తదితరులు నటించారు.
ప్రముఖ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా తెరకెక్కిన లైవ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ కూడా అక్టోబర్ 16న విడుదల కానుంది. నోవా సెంటినియో, ఆండ్రూ కోజి, కాలినా ల్యాంగ్, జేసన్ మోమోవా, విద్యుత్ జమ్వాల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ వీడియో గేమ్ ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది.
అక్టోబర్ 16న మరో హిందీ చిత్రం ‘రఫ్తార్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌కుమార్ రావు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా పండుగ సీజన్లో విడుదల కానున్న చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.
ఇలా అక్టోబర్ నెల మొత్తం థియేటర్లలో వరుసగా భారీ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఒకవైపు సౌత్ నుంచి రజినీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ వంటి సినిమాలు వస్తుండగా.. మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో దసరా పండుగ సీజన్‌తో పాటు అక్టోబర్ మొత్తం సినిమా థియేటర్లు సందడిగా మారే అవకాశం ఉంది.