పాల్వంచ/ మణుగూరు టౌన్/ భద్రాచలం, ఆగస్టు 1 : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పాల్వంచ, మణుగూరు, భద్రాచలంలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు శనివారం 34వ రోజుకు చేరాయి. పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డులతో, మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట మోకాళ్లపై కూర్చొని, భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యుత్ సంస్థల్లో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాల్వంచలో రాజేందర్, యాస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, మడకం శ్రీనివాసరావు, రాజేశ్, తిరుపతి, అఖిల్, మహేశ్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కేశబోయిన కోటేశ్వరరావు, మణుగూరులో శ్రీనివాసరెడ్డి, రవిప్రసాద్, నరేశ్, మహేశ్, ప్రసాద్, వెంకట్రాం, శోభన్, వరుణ, సిద్దుల హుస్సేన్, భద్రాచలంలో జీవన్‌కుమార్, ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.