పాపన్నపేట, అక్టోబర్ 5 : ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు..పొడ్చన్ పల్లి తండాకు చెందిన పాల్త్య అంబ్రియా(68) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారి పిచ్చిగా ప్రవర్తిస్తూ తరచూ ఇంట్లో ఉన్న కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. మద్యం తాగొద్దని చెప్పిన వినేవాడు కాదు.
ఆదివారం సాయంత్రం సమయంలో మద్యం దుకాణం వద్ద ఉండగా కుటుంబీకులు ఇంటికి రమ్మని చెప్పిన వస్తా అని చెప్పి రాలేదు. కుటుంబీకులు రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోయే సరికి చుట్టూ పక్కల వెతికారు. సోమవారం ఉదయం తండా సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా దవాఖానకు తరలించారు. మృతుడి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.