ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : జాతీయ రహదారి 353-బీ విస్తరణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వద్ద నిర్మిస్తున్న వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి 44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. రూ.194 కోట్లతో 33 కిలోమీటర్ల నిర్మాణంలో భాగంగా రెండు వరుసల రహదారితోపాటు తర్నం వంతెనల నిర్మాణం కొనసాగుతున్నది.
వంతెన నిర్మాణం, కల్వర్టులు, ఏడు మీటర్లు ఉన్న రహదారిని పది మీటర్ల విస్తరణ వంటి పనులు చేపడుతున్నారు. 2024 మే నెలలో ప్రారంభమైన పనులు రెండు సంవత్సరాల్లో 2026 మే నెలలో పూర్తి కావాల్సి ఉంది. ఈ రహదారి మీదుగా భోరజ్, జైనథ్, బేల మండలాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం కారణంగా వర్షకాలంలో మూడు మండలాలతోపాటు మహారాష్ట్రకు తమ పనుల కోసం వెళ్తే వారు ఇబ్బందులు పడుతున్నారు.
తర్నం వంతెన పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పిల్లర్లు వేసి స్లాబ్ వేయాల్సి ఉంది. ఇప్పటికే కేవలం పిల్లర్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. నిర్ధేశిత గడువులో పనులు పూర్తి చేసి ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాల్సిన నేషనల్ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఎన్హెచ్ కార్యాలయం ఆదిలాబాద్లో కాకుండా నిర్మల్లో ఉండడంతో అధికారులు అప్పుడప్పుడూ వస్తుంటారని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి జైనథ్, భోరజ్, బేల మండలాల రైతులు వ్యవసాయ పనులు, పంటల విక్రయాలు స్థానికులు తమ రోజువారి అవసరాలు వైద్యం, విద్య, ఇతర పనుల కోసం ఈ రహదారి మీదుగా ప్రయాణం చేస్తుంటారు.
ప్రజా, సరుకు రవాణాకు అంతరాయం కలుగకుండా నేషనల్ హైవే అధికారులు రూ.4.50 కోట్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. భారీగా నిధులు వెచ్చించి నిర్మించిన బ్రిడ్జి వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టాల్సి ఉండగా అధికారులు తక్కువ ఎత్తులో పైపులు వేసి నిర్మాణం చేశారు. దీంతో చిన్నపాటి వర్షానికి వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండగా రవాణాకు ఆటంకం కలుగుతుంది. సరుకులు రవాణా చేసే లారీలు నీటి ప్రవాహానికి ప్రమాదానికి గురై వంతెన కింద పడిపోయిన ఘటనలు గతేడాది చోటు చేసుకొన్నాయి. జిల్లాలో ఇటీవల కురుసిన వర్షాలతో వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించగా రాకపోకలు నిలిచాయి. అధికారులు స్పందించి వంతెన పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.