TN CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ని చూసేందుకు లండన్‌లోని అత్యంత ఎత్తయిన భవనం ‘ది షార్డ్ (The Shard)’ వద్ద మంగళవారం వేలమంది అభిమానులు గుమిగూడారు. అయితే అత్యధిక జనసందోహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు (Metropalitan Police) హెచ్చరించడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. దాంతో విజయ్‌ని చూసేందుకు గంటల తరబడి వరుసల్లో వేచి ఉన్న అభిమానులు నిరాశ చెందారు.
శాంతిభద్రతలు, ప్రజా భద్రత దృష్ట్యా ముందస్తు అనుమతి లభించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి బృందానికి చెందిన ప్రతినిధి మైక్‌లో ప్రకటించారు. తమిళనాడులో చూసే జనసందోహంతో పోలిస్తే ఇది చాలా తక్కువే అయినప్పటికీ, భద్రత పరంగా పోలీసుల నిర్ణయం సహేతుకమైనదేనని చెప్పవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ గంటల తరబడి హోటల్ బయట వేచి ఉన్న అభిమానులకు నిరాశ తప్పలేదని అన్నారు.
మరోవైపు తమిళనాడును ఆసియాలోనే అధునాతన తయారీ, సాంకేతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా విజయ్ నేతృత్వంలోని బృందం బ్రిటన్ పర్యటన చేపట్టింది. ఈ పర్యటనలో భాగంగా రూ.12,300 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 9,400 కంటే ఎక్కువ ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయనే అంచనాలు ఉన్నాయి. తన యూకే పర్యటనను ముగించుకుని విజయ్ ఈరోజు భారత్‌కు చేరుకోనున్నారు.