– సొంత ఇల్లు లేదు.. ఉపాధి లేదు
– 20 ఏళ్లుగా నాలుగు గోడల మధ్యే జీవితం
– వైద్య ఖర్చులు భరించలేక కన్నీటి పర్యంతం
– ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
మాల్, సెప్టెంబర్ 16 : ఆ పిల్లలకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు… తోటి పిల్లలు చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాలను ముందుకు తీసుకెళ్తుంటే.. పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం కారణంగా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం రెండు దశాబ్దాలుగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యారు. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆర్థిక భారంతో కన్నీరు మున్నీరవుతున్నారు. “మా పిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వం అండగా నిలవాలి” అంటూ వేడుకుంటున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామానికి చెందిన కానుకుర్తి శ్రీను, అనిత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించారు. పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించిన ఇద్దరు కుమార్తెలను బతికించుకోవడం, పోషించడం, చదివించడం, వైద్యం చేయించడం కోసం తల్లిదండ్రులు తమకున్నదంతా ఖర్చు చేశారు. ఇలా ఈ కుటుంబం దాదాపు 20 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.
పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. వైద్యం కోసం చేతనైనంత మేరకు డబ్బులు ఖర్చు చేశారు. అయినా వారి పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. ఒకవైపు వైద్య ఖర్చులు.. మరోవైపు కుటుంబ పోషణ.. పిల్లల చదువులు.. ఇంటి అద్దె.. ఇలా ప్రతి అంశం తల్లిదండ్రులకు భారంగా మారింది. అయినా పిల్లలను భారంగా భావించకుండా 20 ఏళ్లుగా ప్రేమతో, ఆప్యాయతతో పోషిస్తూ వస్తున్నారు.
పెద్ద కుమార్తె నికిత (22) ఇంటర్ వరకు చదువుకుంది. చదువుకోవాలన్న తపన ఉన్నా, అంగవైకల్యం కారణంగా బయటకు వెళ్లి సాధారణంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు. తన చదువుకు తగ్గట్టుగా, తన శారీరక పరిస్థితికి అనుగుణంగా ఇంటి వద్ద నుండే చేయగలిగే చిన్న ఉద్యోగం లేదా రైటర్ తరహా ఉపాధి అవకాశం కల్పించాలని నికిత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. “చదువుకున్నాను.. ఏదైనా పని చేసి మా కుటుంబానికి అండగా ఉండాలని ఉంది. కానీ నా పరిస్థితి వల్ల బయటకు వెళ్లలేకపోతున్నాను. ప్రభుత్వం నాకు ఇంటి వద్ద నుండే చేయగలిగే పని కల్పిస్తే నా కాళ్లపై నేను నిలబడగలను” అంటూ నికిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిన్న కుమార్తె నితీష (20) ఆరో తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువును కొనసాగించలేకపోయింది. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. తమ తల్లిదండ్రులు తమ కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు వారిని కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నితీష కన్నీటి పర్యంతమైంది.
ఇంతటి కష్టాల్లో ఉన్న ఈ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కిరాయి ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలా ఇంటి అద్దె చెల్లించడం కుటుంబానికి భారంగా మారింది. పిల్లల అవసరాలు, వైద్య ఖర్చులు, ఇంటి ఖర్చులు, కిరాయి.. అన్నింటినీ భరించలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “పిల్లలను 20 ఏళ్లుగా పెంచాం. మా శక్తికి మించి వైద్యం చేయించాం. చదివించాం. ఇప్పుడు కిరాయి ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. మా పిల్లలను ఎక్కడ వదిలిపెట్టలేం.. తాము ఉన్నంతకాలం వారిని చూసుకోవాల్సిందే. కానీ తమ పరిస్థితి కూడా రోజురోజుకూ దిగజారుతోందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వచ్చే పింఛన్ డబ్బులతోనే కుటుంబ జీవనం ఎలాగోలా కొనసాగుతోంది. ఆ ఆదాయం కుటుంబంలోని అన్ని అవసరాలకు సరిపోకపోవడంతో నిత్యావసరాల కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “ఇప్పటివరకు మమ్మల్ని ఆదుకునే నాధుడు లేడు. పిల్లల భవిష్యత్ ఏంటి అని ప్రతిరోజూ భయంగా ఉంది. ప్రభుత్వం మా కుటుంబాన్ని గుర్తించి ఆదుకోవాలి” అని తల్లిదండ్రులు కన్నీటితో కోరుతున్నారు.
పుట్టినప్పటి నుండి అంగవైకల్యంతో బాధపడుతున్న ఈ ఇద్దరు యువతుల కుటుంబాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి సొంత ఇల్లు, మెరుగైన వైద్య సహాయం, అవసరమైన ఆర్థిక భరోసా, పింఛన్ సౌకర్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇంటర్ చదివిన నికితకు ఆమె శారీరక పరిస్థితికి అనుగుణంగా ఇంటి నుంచే చేయగలిగే ఉపాధి లేదా చిన్న ఉద్యోగం కల్పిస్తే కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా కలుగుతుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. 20 ఏళ్లుగా పిల్లల కోసం తమ జీవితాన్నే త్యాగం చేసిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందా? నాలుగు గోడలకే పరిమితమైన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాల్లో వెలుగు నింపుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.