నీలగిరి, సెప్టెంబర్ 16 : నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అలాగే బీఆర్ఎస్ నల్లగొండ 30వ డివిజన్ ఇన్చార్జ్ జహంగీర్ బాబాపై కేసు నమోదైంది. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి నిరసనగా బీఆర్ఎస్ నల్లగొండ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నెల 8న నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారన్న ఆరోపణలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. FIR నంబర్ 200/2026, 126(2), 132, 189(2), 121(1), 190 BNS సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. శాంతియుతంగా నిర్వహించిన ఆందోళనలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేసులతో తమ పోరాటాలను అడ్డుకోలేరంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పేర్కొన్నారు.