Amaragiri Village | కొల్లాపూర్, మార్చి 10: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల సమీపంలో ఉన్న కుగ్రామమైన అమరగిరిని సంక్షేమ పథకాలను 100% అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నారు. జనవరి 23న గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలోని ప్రజలందరికీ వారి అర్హత ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని.. అందుకోసమే మండలంలో మీ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నామని గ్రామ ప్రజలకు అధికారులు గ్యారెంటీ ఇచ్చారు.
కానీ ఆచరణలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారు. నియోజవర్గంలోనే అతి స్వల్ప జనాభా ఉన్న గ్రామం కూడా ఇదే. గ్రామంలో కేవలం 271 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 110 ఇండ్లు ఉన్నాయి. గ్రామం మొత్తం మీద 22 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంది. ఈ గ్రామాన్ని ప్రణాళిక బద్ధంగా ఎంపిక చేసుకున్నా పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయలేకపోయింది.
సోమవారం నమస్తే తెలంగాణ బృందం సంక్షేమ పథకాలకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న అమరగిరి గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో కనీసం మౌలిక సౌకర్యాలు కూడా లేకపోవడం సంగతి అటు ఉంచితే.. ఉన్న కొద్ది జనాభాకు కూడా సంక్షేమ పథకాలను అందించలేక ప్రభుత్వం విఫలమైనట్లు గ్రామస్తులు తెలిపిన అభిప్రాయాల ద్వారా అర్థమవుతుంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళం పాడింది. నమస్తే తెలంగాణ విజిట్లో భాగంగా అమరగిరి గ్రామంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
అమలు కానీ జీరో కరెంటు బిల్లు :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకం అమరగిరిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా 62 చెంచు కుటుంబాలు ఉన్న కాలనీలో చెంచులు కరెంటు బిల్లులు కట్టడం లేదని గత మంగళవారం నుంచి శనివారం వరకు చెంచు కుటుంబాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. దీంతో చెంచు గూడెం మొత్తం నాలుగు రోజులు చీకట్లో మగ్గింది.
కొద్ది మందికి మాత్రమే రైతు భరోసా..
గ్రామంలోని 22 ఎకరాలకు 12 మంది రైతులు యజమానులుగా ఉంటే అందులో 11 మంది రైతులకు మాత్రమే రైతు భరోసా పడింది. అలాగే కొన్ని తరాల నుంచి 62 చెంచు కుటుంబాలు 360 ఎకరాలలో పోడు చేసుకుని జీవనం గడుపుతున్నా ఎన్నోసార్లు పోడు భూముల పట్టాల కోసం అధికారులకు దరఖాస్తు అందజేసిన కేవలం రెండు కుటుంబాలకు ఐదు గంటల భూమి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది
భరోసానివ్వని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామం లో 12 మంది రైతులు మిగిలిన వారు మొత్తం కూలి పని పై ఆధారపడి బ్రతికే వారే ఉన్నారు. చెంచులు మినాయించి 37 జాబు కార్డులు ఉన్న బీసీ ఎస్సీ కుటుంబాలలో 12 మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఖాతాలలో జమయ్యాయి. మిగిలిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భరోసా ఇవ్వలేకపోయింది. అలాగే 62 చెంచు కుటుంబాలకు గత సంవత్సరం నుంచి ఉపాధి హామీ పనులు కూడా కల్పించలేదు. 62 కుటుంబాలలో ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తించలేదు. గ్రామంలో 12 మంది రైతులు మినహాయించి.. గ్రామస్తులు అందరూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు కానీ కేవలం 12 మందికి మాత్రమే ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప జేసి మిగిలినవారికి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండిచ్చింది.
ఇందిరమ్మ ఇండ్లు..
గ్రామంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభించలేదు. కనీసం లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు. గ్రామంలో పూర్తిస్థాయిలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలలోని ఏ ఒక్క పథకం కూడా గ్రామంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కనీసం ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా 20% కు మించి అమలు కాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుంది.
గ్రామ అధికార పార్టీ నాయకుడు మల్లేష్ మాట్లాడుతూ.. గ్రామంలో పూర్తిస్థాయిలో మా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా మా చెంచు కాలనీ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి చెంచులు అర్హత కలిగిన ఏ ఒక్కరికి పథకం అమలు కాలేదు ఎన్నికల ముందు మా పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ చెంచులకు భరోసానివ్వలేదన్నారు.
గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ మాట్లాడుతూ.. గ్రామంలో మహాలక్ష్మి పథకం అమలు కాలేదని తెలిపారు. గత సంవత్సరం నుంచి ఉపాధి హామీ పనులను కూడా నిర్వహించలేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హత ఉన్న పథకం రాలేదన్నారు.
ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు..
గ్రామానికి చెందిన మరో యువకుడు అశోక్ మాట్లాడుతూ.. గ్రామంలో గ్రామ సభ పెట్టి పైలెట్ ప్రాజెక్టు కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అమలు అవుతుందని తెలిపారు. కానీ పైలట్ ప్రాజెక్టు కింద మా గ్రామాన్ని ఎంపిక చేసి పూర్తిస్థాయిలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. చెంచులు కరెంటు బిల్లులు కట్టడం లేదని కరెంట్ కనెక్షన్ తీసేసినా.. ఏ ఒక్క అధికారి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదు.? గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు చెంచులకు వర్తిస్తాయో..? లేదో..? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి