వెల్దండ, మార్చి 10: చేతకాకపోతే గద్దె దిగాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు (Dairy Farmers) విరుచుకుపడ్డారు. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు బాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దాపూర్ గేటు వద్ద హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రాత్రింబవళ్లు కష్టపడి అప్పులు చేసి పాలు పోస్తే నాలుగు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోతే ఇలా బ్రతకాలని ప్రశ్నించారు. గతంలో ఏనాడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాడి రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పాలించే చేతకాకపోతే ఎందుకు ఉండాలని, వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకొని, లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసగించిందని ఆరోపించారు. వెంటనే పెండింగులో ఉన్న పాల బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, నాయకులు వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, యాదయ్య, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పాల బిల్లులు తగ్గించ్చొద్దని పాలకేంద్రం వద్ద..
ఊరుకొండ, మార్చి 10: తెలంగాణ రైతు సంఘం పిలుపు మేరకు పాల ధర తగ్గించి తమను ముంచొద్దని పాడి రైతులు నిరసనకు దిగారు. ప్రభుత్వం మొండి వైఖరివీడి పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఊరుకొండ మండలం ఠాగూర్ తాండ ఇప్పపహాడ్కు చెందిన పాడి రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతులను ఇబ్బంది పాలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు పాడి రైతులకు చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా లీటర్ ధర తగ్గిస్తామని విజయ డైరీ ప్రజలను పాడి రైతులను మోసం చేసేలా ముందుకు సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.