ప్రస్తుత కాలంలో ఒక సినిమాను నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు చేర్చడం (ప్రమోషన్) అంతకంటే పెద్ద సవాలుగా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలు కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకుంటుంటే, సామాజిక స్పృహతో వచ్చే చిన్న చిత్రాలు మాత్రం తమ అస్తిత్వం కోసం పోరాడాల్సి వస్తోంది. అయితే, ఈ మూస ధోరణిని బద్దలు కొడుతూ, వినూత్న ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” చిత్రబృందం. కేవలం కాన్సెప్ట్ పరంగానే కాకుండా, ప్రచారంలోనూ ఈ చిత్రం విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఈ సినిమాలో రైతులకు ఉపయోగపడే అంశాలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో, చిత్రబృందం ప్రచారాన్ని నేరుగా రైతుల మధ్య నుంచే ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ‘రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షో’లో ఈ చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. సాధారణంగా వ్యవసాయ పరికరాలు, విత్తనాల స్టాళ్లు ఉండే చోట, ఒక సినిమా స్టాల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా ఉద్దేశాన్ని వివరించి వారి మన్ననలు పొందారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTSAU) జరిగిన మెగా రైతు మేళాలో కూడా ఈ టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు, అధికారులు మరియు మహిళా యాక్టివిస్టులు ఈ స్టాల్‌ను సందర్శించారు. సామాజిక బాధ్యతతో సినిమాను రైతులకు చేరువ చేస్తున్నందుకు చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు వెళ్తున్న తరుణంలో, వ్యవసాయాన్ని సాంకేతికతతో ఎలా అనుసంధానం చేయవచ్చో ఈ చిత్రం అద్భుతంగా చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్, మరియు బ్లాక్‌చెయిన్ వంటి అత్యాధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో జోడిస్తే భవిష్యత్తు వ్యవసాయ రంగం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. వ్యవసాయంతో పాటు, నేటి సమాజంలో పెను సవాలుగా మారిన విడాకుల సమస్యను కూడా ఈ చిత్రం సున్నితంగా స్పృశించింది. మునుపటి తరాలలో పెద్దలు కుటుంబాలను ఎలా నిలబెట్టారు? నేటి తరం స్వేచ్ఛను కోరుకుంటూనే సంప్రదాయ విలువలను ఎలా కాపాడుకోవాలి?” అనే ప్రశ్నలకు ఈ సినిమా సమాధానం వెతుకుతుంది.
సందేశాత్మక చిత్రం అనగానే సీరియస్‌గా ఉంటుందని అనుకుంటే పొరపాటే. దాదాపు 10 మంది అగ్రశ్రేణి కమెడియన్స్‌తో ఈ సినిమా పూర్తిస్థాయి వినోదభరితంగా సాగుతుంది. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, ‘వైవా’ హర్ష వంటి హేమాహేమీలు నటిస్తున్నారు.
చిత్ర సాంకేతిక వివరాలు:
నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సీవీఎల్ నరసింహరావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు తదితరులు.
దర్శకత్వం: మధుదీప్ చెలికాని
నిర్మాత: అరవింద్ మండ్యం
బ్యానర్: లోటస్ క్రియేటివ్ వర్క్స్ (సమర్పణ: CH.V.N.S బాబ్జి)
సంగీతం: అరుణ్ చిల్వేరు, ప్రకాష్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: రవికుమార్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సామాజిక బాధ్యత, సాంకేతిక పరిజ్ఞానం మరియు కడుపుబ్బ నవ్వించే వినోదం కలగలిసిన “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!