Anna Konidala | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) మరోసారి తన సేవా దృక్పథంతో ప్రశంసలు అందుకుంటున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న ఆమె.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకున్న గౌరవాన్ని తరచూ పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు.రష్యాలో జన్మించినప్పటికీ భారతీయ ఆచారాలను పాటిస్తూ పూజలు, పండుగలు, కుటుంబ వేడుకల్లో సంప్రదాయ దుస్తులతో కనిపించే అన్నా కొణిదెలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఆమె తీసుకున్న మరో నిర్ణయం అందరి ప్రశంసలను అందుకుంటోంది.
తాజాగా అన్నా కొణిదెల హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని రెండు జంతువులను దత్తత తీసుకున్నారు. అందులో ఒకటి ఆసియా ఏనుగు, మరొకటి రాయల్ బెంగాల్ టైగర్. ఈ జంతువుల ఆహారం, వైద్య సంరక్షణతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులను ఇకపై ఆమె భరిస్తారని సమాచారం. జూ పార్క్‌లో ఆయా జంతువుల వద్ద అన్నా కొణిదెల దత్తత తీసుకున్నట్లు ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం జూలో జిరాఫీలను దత్తత తీసుకుని జంతు సంరక్షణకు తన వంతు సహకారం అందించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అన్నా కొణిదెల కూడా ముందుకు రావడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అన్నా కొణిదెల నిర్ణయంపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. జంతు సంరక్షణకు వ్యక్తిగతంగా సహకరించడం సమాజానికి మంచి సందేశమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణపై మరింత అవగాహన పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.సామాజిక బాధ్యతను మరోసారి చాటిన అన్నా కొణిదెల తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.