Journalists | కొల్లాపూర్, జూన్ 27 : నాలుగు స్తంభాలలో ఒక స్తంభమైన జర్నలిస్టులకు అవమానాలు, అసమానతలు ఎదురవుతున్నాయని జర్నలిస్టులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు.. వారి డిమాండ్లు 100% న్యాయమైనవి.. మంత్రిగా ఉన్న జూపల్లి భేషజాలకు పోకుండా వెంటనే ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ పట్టణం ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు పాలకుల చేతిలో మోసపోతున్నారన్నారు. నాయకులు గెలవకముందు ఇచ్చిన మాటలు గుర్తు చేసుకొని.. గెలిచిన తర్వాత వాటిని అమలు చేయాలన్నారు. అన్ని ప్రాంతాలలో జర్నలిస్టులకు ఇండ్లు ఉన్నాయి కానీ కొల్లాపూర్లో ఎందుకులేవో మంత్రి గుర్తించాలన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధనకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామన్నారు.
డిమాండ్లు పట్టించుకోకపోవడం వల్లే రోడ్లపైకి..
నాగర్ కర్నూల్ జిల్లా సీపీఎం కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోనే ఇండ్ల స్థలాలు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని జర్నలిస్టులు పోరాడుతున్నా.. న్యాయమైన డిమాండ్లు పట్టించుకోకపోవడం వల్లే రోడ్లపైకి వచ్చారన్నారు. పార్టీలకు ప్రజల పక్షాన ప్రజల సమస్యల పట్ల వార్తలు రాస్తూ ప్రజాలోకానికి అందిస్తూ చైతన్యం చేస్తున్నారన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణంలో 72 సర్వే భూమిలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీను మాట్లాడుతూ.. గన్ను కన్నా పెన్ను మిన్న అనే విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు తమ మద్దతు ఉంటుందన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యా నాయక్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల పోరాటం న్యాయమైనదన్నారు.
సమాజం కోసం పనిచేసే విలేకరులకు ఎటువంటి ఆధారం లేదని పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు విలేకరులకు హామీలు ఇస్తూ.. జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ.. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.
కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..
బుడగ జంగం హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షులు నరసింహ మాట్లాడుతూ.. విలేకరులు మూడో నేత్రం లాంటివారని ప్రోటోకాల్ ప్రకారం కుటుంబాలను వదిలి పనిచేస్తున్నారని చీకటిలో వెలుగులు నింపేవారు విలేకరులన్నారు. రాజకీయ నాయకుల ఆదాయం ఎలా పెరుగుతుందో చూస్తున్నాం. జర్నలిస్టుల కుటుంబాలు గడపడం అతికష్టంగా మారిందని గత ప్రభుత్వం విలేకరులకు మొండి చేయి చూపిందని జూపల్లి తలుచుకుంటే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వచ్చునన్నారు.
కొల్లాపూర్ విలేకరులకు 200 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలు మంత్రి హోదాలో ఉన్న మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి విలేకరులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. విలేకరుల సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
గొందిమల్ల వెల్టూరు వంతెన సాధన కమిటీ నాయకులు కాశన్న, మల్లయ్యలు మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం చేసే విలేకరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం దుర్మార్గం అన్నారు. వెంటనే కొల్లాపూర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు బీజేపీ మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్ కిసాన్ మోర్చా నాయకుడు శేఖర్ గౌడ్ బీజేపీ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాడం శ్రీనివాసులు మాట్లాడారు.
ఈ దీక్షలలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రామచంద్రం నియోజవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటి జిల్లా నాయకులు మల్లికార్జున సాగర్, సీనియర్ జర్నలిస్టులు బచ్చలకూర కురుమయ్య, సిపి నాయుడు, రమణ కారంగి, గోవిందు, సురేందర్, మల్లేష్, స్వాములు, పారుశరాముడు, వెంకట రాములు, రాము, శివ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కిసాన్ మోర్చా తమటం శేఖర్ గౌడ్, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, మండల అధ్యక్షుడు నారాయణ పట్టణ అధ్యక్షుడు కాడం శ్రీనివాసులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.