Virosh | టాలీవుడ్లో ఎన్నో సంవత్సరాలుగా హాట్ టాపిక్‌గా మారిన ప్రేమజంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం విజయ్ స్వగ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడంతో పాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ జంట ప్రేమకథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తొలిసారి గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. మొదటిసారి విజయ్ను చూసినప్పుడు రష్మిక కొంచెం భయపడ్డానని చెప్పినట్లు సమాచారం. అయితే షూటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే తరువాత ప్రేమగా మారింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవడం విశేషం. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో విజయ్ దేవరకొండ తన ప్రేమ కథకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ బయటపెట్టాడు. రష్మికనే ముందుగా తనకు ప్రపోజ్ చేసిందని ఆయన వెల్లడించాడు. డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో తమ మధ్య ప్రేమ మరింత బలపడిందని తెలిపాడు. అప్పట్లో రష్మిక తన భావాలను వెల్లడించగా తాను వెంటనే ‘యెస్’ చెప్పానని విజయ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల తర్వాత చాలా కాలం తర్వాత ఈ జంట మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రణబాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. పెళ్లి తర్వాత విజయ్–రష్మిక జంటగా వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలయ్యే అవకాశముంది. ఇక పెళ్లి అనంతరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4న ఈ జంట గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేశ్, నాగచైతన్య, నాగార్జున అక్కినేని, రామ్ చరణ్, నాని, నవీన్ పొలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి కూడా హాజరయ్యారు.