10th class exams | అచ్చంపేట, మార్చి 22 : అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ రమేష్ కుమార్ సూచించారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య, శ్రీ కాకతీయ పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు జరుగుతున్న పదవ తరగతి హిందీ పరీక్షల నిర్వహణ తీరును ఇవాళ ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించడంతోపాటు, పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లు, వైద్య సహాయ శిబిరాల ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సహాయం అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి రెండో రోజు పరీక్షలకు 10,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 10,527 మంది విద్యార్థులు హాజరై 99.77% హాజరు శాతం నమోదైనట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. హిందీ పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్, స్ట్రాంగ్ టీచర్ రఘు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Also :
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు