కొన్ని వందల కథలు, నవలలు సమర్థవంతంగా అనువాదాలు చేసిన వ్యక్తులు తెలుగు సాహిత్యంలో చాలా తక్కువమంది ఉంటారు. అందులో ముక్తవరం పార్థసారథి అగ్రభాగంలో ఉంటారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత అనువాదాలు ఎక్కువగా చేశారు. విదేశీ కథకుల రచనా శైలి గురించి, వాళ్లు తీసుకునే కథా వస్తువు గురించి ఆయన ఎప్పుడూ చెప్పేవారు.
ఒకసారి.. ‘సార్..మీరు ఇతర భాషల్లోని కథలు, నవలలే అనువాదాలే చేసేవారా? స్వయంగా రాసిన కథలు, నవలలు లేవా’ అని అడిగాను. దానికి ఆయన..‘నువ్వు కూర్చున్న కుర్చీ వెనుక షెల్ఫ్ తెరువ్..అందులో మొదటి వరుసలో ఉన్న రెండో పుస్తకం తియ్యు’ అన్నారు. అది ఆయన రాసిన ‘మిణుగుర్లు’ కథా సంపుటి. ఈ కథా సంపుటితోపాటు ఆయన 10 దాకా నవలలు, పదుల సంఖ్యలో అనువాదాలు చేశారు. ఆయన చేసిన ‘జాక్ లండన్ ఉక్కుపాదం’ నవలానువాదం చాలా పేరు తెచ్చింది.
తొమ్మిది దేశాల కథలు, చెహోవ్ కథలు, విశ్వకథా శతకం, కథల వాచకంతో పాటు తత్వశాస్త్రం అంటే ఏమిటి, ప్రేమ-పెట్టుబడి వంటి ఎన్నో ప్రఖ్యాత పుస్తకాలను ఆయన తెలుగులోకి అనువదించారు. చతుర, విపులలో ఎంతోమంది రచయితలను ఆయన పరిచయం చేశారు. ముక్తవరం సతీమణి వసంత లీఫ్ ఆర్టిస్ట్. తాను సేకరించిన ఆకులకు రంగులు అద్ది రకరకాల బొమ్మలు వేసేవారు. ఆకును కత్తిరించకుండా అలానే తన పెయింటింగ్స్‌లో వాడేవారు. వాటిలో కొన్ని బొమ్మల్ని ‘ముక్తవరం’ తన పుస్తకాలకు ముఖచిత్రాలుగా వేసుకోవడం విశేషం.
ఆయన అనువాదం సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేది. నిజానికి తెలుగు సాహిత్యంలో ఇంత గొప్ప అనువాదాలు చేసిన రచయిత ముక్తవరం పార్థసారథి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ నుంచి ఇంకా మంచి కథలు రావాలని ఆయన ఎప్పుడూ అభిలషించేవారు. ఆయన మాట తీరు జలపాత హోరు కాదు. ఏదైనా విషయం మీద చర్చ మొదలు పెట్టగానే ‘ఆగండి..మొదలు వినండి’ అని మెల్లగా తాను చెప్పదలచుకొన్న దానిని మొహమాటం లేకుండా, నిక్కచ్చిగా చెప్పేవారు. చర్చ వేడి పెరిగితే..చాలా కూల్‌గా అది పక్కకు పెట్టండి కాసేపు అని చర్చను గొడవ లేకుండా చేసేవారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా పెద్దింటి అశోక్ కుమార్ కథల్ని ఆయన బాగా ఇష్టపడేవారు.
ముక్తవరం ఎప్పుడూ ఏ గుర్తింపునూ కోరుకోలేదు. ఏ అవార్డు కోసం ఎవరి నీడల్ని కూడా ఆయన అనుసరించలేదు. ఫోన్లు చేసి తన పేరు రికమండ్ చేయాలని ఏ పెద్ద సాహిత్యకారుల్నీ అడగలేదు. తన సాహిత్య రచనే పరమావధిగా బతికారు. కొంచెం వంగి, వంగి నడిచినా అనువాద ప్రక్రియను సమాజంలో నిటారుగా నిలబెట్టారు. నిదానమైన మాట తీరు, నదీ ప్రవాహపు వేగంతో వేల పేజీల అనువాదాల జోరు అదే పార్థసారథి.
ఒక్కమాట.. రెండు తెలుగు సమాజాలు ముక్తవరం పార్థసారథి వ్యక్తిత్వాన్ని సరిగ్గా అనువాదం చేసుకోలేదేమో అనిపిస్తుంటుంది. ఎవరూ తనను పట్టించుకోకున్నా ముక్తవరం టేబుల్ మీద అద్దాల్లోంచి ఎప్పుడూ సమాజాన్ని కనిపెడుతూనే ఉంటారు. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆయనకు వినమ్ర నివాళి.
-వేముగంటి మురళి
6302507317