భారతదేశంలో దక్షిణకాశీగా పేరెన్నికగన్న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికి సాహిత్యపరంగా ఎంతో పేరున్నది. ఎందరెందరో మహాకవులు, మహాపండితులకు జన్మనిచ్చింది వేములవాడ. పంపన, వేములవాడ భీమకవి లాంటి మహాకవులు ఇక్కడివారే.
అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ కూడా జన్మించారు. సంప్రదాయ కవితకు ఒరవడిని దిద్దిన కవి ఆయన. గేయకవిగా కూడా ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. సంప్రదాయకవిగా కొనసాగుతూనే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తన మార్గాన్ని మార్చుకొని కవిత్వాన్ని సామాన్యులకు దగ్గరగా తీసుకొచ్చిన కవి మామిడిపల్లి సాంబశివశర్మ.
1918 జూన్ 24న సత్తెమ్మ, మృత్యుంజయ శర్మ దంపతులకు జన్మించిన సాంబశివశర్మ సాంబకవిగా సుప్రసిద్ధుడు. 1935-1952 మధ్యకాలంలో వేములవాడ నాటక ప్రదర్శనల ద్వారా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించారు. కుల వివక్ష, జాతీయ సంస్కరణలపై నాటకాలు రాశారు. ‘లోభసంహారం’, ‘మధుర ఝంకారం’ (మంగళహారతులు, కీర్తనలు), ‘ముక్తాహారం’ (పద్యకావ్యం), ‘కుంజవిహారం’ (పద్యకావ్యం), ‘జయశ్రీ’ (పద్యకావ్యం), ‘ద్విపద రామాయణం’ (రాధే శ్యాం రామాయణానికి స్వేచ్ఛానువాదం), ‘దక్షయజ్ఞం’ (బుర్రకథ), ‘బాసర సరస్వతి సుప్రభాతం’, ‘శ్రీకాళేశ్వర ముక్తీశ్వర సుప్రభాతం’, ‘గంగా సుప్రభాతం’ మొదలైన రచనలు చేశారు. ఆయన రాసిన ‘భద్రావతి’, ‘త్యాగయ్య’, ‘ముగ్గురు మరాఠీలు’ వంటి బుర్రకథలు అముద్రితాలుగా ఉన్నాయి. ‘శ్రీ రాజరాజేశ్వరస్వామి సుప్రభాతం’ రచనతో వేములవాడకు ‘లేంబాలవాటిక’ అనే పేరును ఇచ్చారు. గేయరచనలు, ఉపన్యాసాల ద్వారా హిందీభాషా ప్రచారోద్యమంలో ఆయన విరివిగా పాలుపంచుకున్నారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడిగా వినుతికెక్కారు. గ్రంథాలయ నిర్వాహకునిగా, ‘కాకతీయ’ పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు.
పురాణ ప్రవచనాలు, హరికథాగానాలు, నటన, సంగీత దర్శకత్వం, కవిత్వం, సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో పాండిత్యం, అవధానం ఇలా ఎన్నింటిలోనో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగినా గురువుల దగ్గర నేర్చుకున్నది చాలా తక్కువ. అన్నీ ఆయన స్వయంగా నేర్చుకున్నవే. త్రికాండ అమరం, ఆంధ్ర నామసంగ్రహంను చిన్నతనంలోనే కంఠస్థం చేశారు. మేధాదక్షిణామూర్తిని ఉపాసన చేశారు.
ఆచార్య సి.నారాయణరెడ్డి, అనంతరాజశర్మ, మునుగోటి కృష్ణమూర్తి, వజ్ఝల సాంబయ్య, చొప్పకట్ల చంద్రమౌళి మొదలైనవారు సాంబశివశర్మకి సమకాలికులు. సాంబశివశర్మ హరికథలు విని ఉత్తేజం పొందిన వాడినని డా.సినారె చెప్పేవారు.
వర్తమాన సమాజంపై పడి దోచుకుంటున్న అన్ని వర్గాలను తీవ్రంగా ఆయన విమర్శించేవారు. 1940-50 ప్రాంతంలో మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కాస్త సేదదీరడానికి హరికథలు, బుర్రకథలు, నాటకాలే ఆధారం. వాటిని ఆధారంగా చేసుకొంటూ తన కవిత్వంతో సమాజాన్ని ఆలోచింపజేయడంలో ఎంతో కృషి చేశారు. సాంబశివశర్మ గొప్ప శివభక్తుడు. రాజరాజేశ్వర సుప్రభాతం రాస్తూ.. మొదటి శ్లోకంలో భారతమాతను స్తుతిస్తూ తన దేశభక్తిని చాటుకున్న తీరును గమనిస్తే..ఆయనలోని సాహిత్య సంస్కారం ప్రస్ఫుటమవుతున్నది.
‘యస్వామూర్థి హిమాలయస్య శిఖరశ్చంచత్కిరీటియతే..’ఈ సుప్రభాతం గురించి సినారె పీఠిక రాస్తూ ‘ఏమి ఎత్తుగడ’..ఇది హిమగిరి శృంగమంత ఎత్తైనది’ అంటారు. శర్మ ఇలా తన రచనలన్నింటిలో కన్నతల్లికి, జన్మభూమికి ప్రాధాన్యతనిచ్చారు. పేదల దేవుడైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జునస్వామిపై కూడా సుప్రభాతాన్ని రాశారు. అనేక పద్యాల్లో శ్రమజీవన సౌందర్యాన్ని ప్రకటిస్తూ, సామాజిక స్పృహను కలిగించారు. ఆయన రచనల్లో సుప్రభాతాలు, పరిశోధనలకు ప్రత్యేకస్థానం ఉన్నది. ఆయన పేరెత్తగానే హరికథలు, సుప్రభాతాలే జ్ఞాపకం వస్తాయి. శ్రీ బాసర సరస్వతీదేవిపై రాసిన సుప్రభాతం కూడా ఆయన రాసిన సుప్రభాతాల్లో విశిష్టమైనది. ఆయన పద్యధార, గేయధార, హరికథల్లో సంస్కృత సుదీర్ఘ సమాసాలు పొంగిపొర్లుతాయి. ఇది ఆయన ప్రత్యేకత. చిక్కనైన పద్యధార ఆయనది..మచ్చుకు…‘మా తెలగాణమందు నవమంజుల దివ్య సరస్వతీద్యుతుల్ పూతలు పూచి కాచి రసపూర్ణములై ఫలియింపగావలెన్ నీతుల జిమ్మి మానవుల నెమ్మదులన్ కరిగింపగావలెన్ తాతలనాటి సత్కవన ధాటుల నాటకమాడగావలెన్’
తెలంగాణలో సారస్వతదీప్తులను వెలిగించాలని, నీతితో మానవజీవితాలు వికసించాలని, సాహితీ చైతన్యం నాట్యమాడాలని ఆశిస్తూ రాసిన పద్యమిది. మహాకావ్యాలు, ప్రబంధాలు, వ్యాకరణ శాస్త్రగ్రంథాలను ఔపోసన పట్టారు. ఎన్నో ప్రవచనాలు చేస్తూ అర్థంకాని విషయాలను విడమర్చి చెప్పేవారు. ఆయన సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలూ జరిగాయి. వేములవాడ దేవస్థానానికి ఆస్థాన కవిగా కూడా ఆయన పనిచేశారు. సాహిత్యం, కళాభిరుచి, సామాజిక చైతన్యంతో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చెరగని ముద్ర వేసిన సాంబశివశర్మ 1998 జనవరి 9న అమరులయ్యారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
94403 69939