రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రభుత్వం సేకరించే భూములకు సంబంధించి బాధిత రైతుల భవిష్యత్తుకు తగిన భరోసా ఇవ్వాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నదని.. కొన్నేండ్లుగా ఆ భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి కొన్నిచోట్ల బలవంతంగా లాగేసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు రూ. కోటి పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కందుకూరు మండలంలోని బేగరికంచెలో ఎండోమెంట్ భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 30 లక్షల నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని, వారికి ఎకరాకు కనీసం రూ. కోటి చొప్పున పరిహారాన్ని చెల్లించాలన్నారు. శనివారం ఆమె బేగరికంచె భూసమస్యలపై రైతులతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి ఆమె వివరించారు.
ప్రస్తుతం ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి వచ్చే బేగరికంచెలో భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వదని.. ఎకరానికి రూ. కోటి చెల్లిస్తే వారు మరో చోట భూములను కొనుక్కుంటారన్నారు. అదేవిధంగా రావిర్యాల వక్ఫ్‌బోర్డు భూముల విషయంలోనూ రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కొన్నేండ్లుగా భూములను సాగు చేసుకుంటున్న రైతులను కాదని.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ఉత్తర్వుల పేరుతో ఆ భూములపై హక్కులు పొందేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి రైతుల హక్కులను కాపాడాలని రంగారెడ్డి కలెక్టర్‌కు సూచించారు.
గతంలో ఫార్మాసిటీకోసం 14,000 ఎకరాలను సేకరించగా.. రైతులకు ఎకరానికి ఒక గుంట చొప్పున ఇండ్ల స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ చాలామంది రైతులకు ప్లాట్లపై పొజీషన్ ఇవ్వలేదని..అర్హులందరికీ ఇండ్లస్థలాల పొజీషన్ ఇవ్వాలని మాజీ మంత్రి సబితారెడ్డి డిమాండ్ చేశారు. బేగరికంచెతోపాటు పలు గ్రామాల్లో భూసేకరణ ద్వారా భూములు తీసుకున్న ప్రతిరైతుకూ ఎకరానికి గుంట చొప్పున ఇండ్లస్థలం ఇవ్వాలన్నారు. భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠధామాలు, కమ్యూనిటీహాళ్లు, క్రీడా మైదానాల కోసం గ్రామానికి పది నుంచి ఇరవై ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. రైతులు భూములు కోల్పోతే పరిహారం ఇచ్చే సరిపుచ్చొద్దని.. వారి కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో కందుకూరు మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.